ఆణివార ఆస్థానం..

176

తిరుమలలో ఈరోజు ఉదయం సాలకట్ల ఆణివార ఆస్థానం ఘనంగా జరిగింది. ఏటా సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో కర్కాటక సంక్రాంతి రోజున ఈ వేడుక నిర్వహిస్తుంది. తమిళులు అనుసరించే సౌరమానం ప్రకారం ఆణి మాసంలో చివరి రోజు నిర్వహించే కొలువు కావడంతో.. ఆణివార ఆస్థానంగా పిలుస్తారు. ఈరోజు ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య మందిరంలోని బంగారువాకిలి ముందుగల ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామిని గరుత్మంతునికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేశారు. మరో పీఠంపై స్వామివారి సర్వ సైన్యాధ్యక్షుడైన విష్వక్సేనుల వారు దక్షిణాభిముఖంగా వేంచేపు చేశారు. అనంతరం ఆనంద నిలయంలోని మూలవిరాట్టుకు, బంగారు వాకిలి దగ్గర ఆస్థానంలో వేంచేపు చేసి ఉన్న ఉత్సవమూర్తులకు, ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదించారు. సాయంత్రం శ్రీవారికి పుష్పపల్లకి సేవ ఉంటుంది. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి వర్ణరంజిత పుష్పపల్లకిని అధిరోహించి.. తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు కనువిందు చేస్తారు. ఈ వేడుక నేపథ్యంలో ఈరోజు శ్రీవారికి సుప్రభాతం మినహా ఆర్జిత సేవలన్నింటినీ టీటీడీ రద్దు చేసింది.