ఆత్మకూరులో హైటెక్ వార్

2660

నెల్లూరు జిల్లా ఆత్మకూరులో మాజీమంత్రి ఆనం రామనారాయణరెడ్డి పై కన్నబాబు వర్గం ఫేస్ బుక్ వార్ మొదలుపెట్టింది. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ఆత్మకూరు నియోజక వర్గానికి పోటీచేసి ఓడిపోయిన కన్నబాబు, ఆనం వర్గం టీడీపీలో చేరే వరకు నియోజక వర్గ ఇన్చార్జ్ గానే ఉన్నారు. రామనారాయణరెడ్డి చేరికతో కన్నబాబు ప్లేస్ ఆనంకు దక్కింది. దీన్ని కన్నబాబు వర్గం జీర్ణించుకోలేకపోయింది. ఆ తర్వాత జరిగిన పలు సంఘటనలు ఇద్దరి మద్య దూరాన్ని పెంచాయి. కన్నబాబు పార్టీలో సీనియర్ నాయకుడు కావడంతో మంత్రులు కూడా ఆయనను చేరదీశారు. కన్నబాబు తన వర్గాన్ని రామనారాయణరెడ్డి వైపు మళ్లకుండా సాధ్యమైనంత వరకు నిలువరించాడు. ఈ పరిస్ధితుల్లో ఓ రెండు సందర్భాల్లో పార్టీ కీలక సమావేశాల్లో కన్నబాబు ఉండడంపై రామనారాయణరెడ్డి బహిరంగంగానే వ్యతిరేకించారు. ఈ తర్వాత ఇటీవల జిల్లాలో జరిగిన మూడు ముఖ్య సమావేశాలకు రామనారాయణరెడ్డి హాజరుకాలేదు. పరిస్ధితులు ఇలా ఉండగానే కన్నబాబు వర్గం కన్నబాబు యూత్, కన్నబాబు అభిమానులు పేరుతో రామనారాయణరెడ్డిపై ఫేస్ బుక్, వాట్సప్ లలో యుద్దం మొదలు పెట్టారు. కన్నబాబు వర్గానికి చెందిన జన్మభూమి కమిటీలను రామనారాయణరెడ్డి రద్దు చేయించారు. దీనిపై కన్నబాబు హైకోర్టులో స్టే ఉత్తర్వులు తీసుకువచ్చారు. దీన్ని రామనారాయణరెడ్డికి రాజకీయంగా షాక్ తగిలిందంటూ పోస్టింగ్ లు పెట్టారు. తర్వాత రామనారాయణరెడ్డి, కన్నబాబు వీరిలో ఎవరు గొప్ప అంటూ మురళీ కన్నబాబు అభిమానుల పేరుతో మరో వివాదాస్పద పోస్టింగ్ పెట్టారు. ఆత్మకూరు నియోజకవర్గంలో కొన ఊపిరితో ఉన్న పార్టీని బ్రతికించింది కన్నబాబు అని, సోమశిల నీటికోసం ఉద్యమించింది కన్నబాబు అని, పాదయాత్రలతో టీడీపీని బ్రతికించిన నేత కన్నబాబు అని, పల్లెలకు రోడ్డు సౌకర్యం కల్పించింది కన్నబాబే నని పార్టీ అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ వేధింపుల నుంచి ఆ పార్టీని కాపాడుకుంది కన్నబాబేనంటూ వివిధ పోస్టింగ్ లను పెట్టారు. ఇవేకాక కన్నబాబు నాయకత్వం ఆత్మకూరుకు అవసరం అంటూ ఫేస్ బుక్ ఉద్యమం లేవదీశారు. ఆత్మకూరులో ఈ విధంగా హోరాహోరాగా ఫేస్ టు ఫేస్ ఫేస్ బుక్ వార్ జరుగుతోంది.