ఇంటికొద్దన్నాను.. కాటికి పోయాడు

2008

కొడుకుని సెలవలకు ఇంటికి రమ్మని చెప్పినా బతికుండేవాడని బిడ్డ శవం దగ్గర భోరున విలపించింది ఆ తల్లి. ఫెయిల్ అయిన సబ్జెక్ట్ లు చదువుకోమని తామే గూడూరులో ఉండాలని చెప్పామని, ఇలా జరుగుతుందని అనుకోలేదని గుండెలవిసేలా రోదించింది. ఇంజినీరింగ్ విద్యార్థి లక్ష్మీ సాయి(21) ఆత్మహత్య ఘటనలో కుటుంబ సభ్యులు రావడంతో పోలీసులు శవాన్ని వారి సమక్షంలోనే తరలించారు. నిజానిజాలు విచారణలో తెలుస్తాయని అన్నారు గూడూరు సీఐ. కుటుంబ సభ్యుల రావడంతో మృతదేహాన్ని రూమ్ లోనుంచి కిందకు తీసుకొచ్చారు. పోస్ట్ మార్టమ్ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పోలీసుల వివరాల మేరకు.. నారాయణ ఇంజినీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ చదువుతున్నాడు లక్ష్మీసాయి. స్వగ్రామం రాపూరు మండలం గుండవోలు గ్రామం. ఫస్ట్ ఇయర్ లో సాయి 4 సబ్జెక్ట్ ల్లో ఫెయిల్ అయ్యాడు. ఇటీవలే సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు పూర్తికావడంతో ఈనెల 14నుంచి కాలేజీకి సెలవలిచ్చారు. సెలవల్లో ఇంటికొస్తానని తల్లికి ఫోన్ చేసి చెప్పగా, గూడూరులోనే ఉండి చదువుకోమని కుటుంబ సభ్యులు బదులిచ్చారు. దీంతో ఫ్రెండ్ రూమ్ లో ఉన్నాడు సాయి. సెలవల్లో స్నేహితులు కూడా ఇళ్లకు వెళ్లిపోవడంతో ఒక్కడే రూమ్ లో ఉన్నాడు. ఈనేపథ్యంలోనే 3 రోజుల క్రితం ఫ్యాన్ కి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు సాయి. ఈరోజు స్నేహితులు ఊరినుంచి వచ్చి చూసే సరికి ఫ్యాన్ కి శవం వేలాడుతోంది. దీంతో వారు పోలీసులకు సమాచారమిచ్చారు.