ఉపాధి హామీ పనులు పర్యవేక్షించిన కలెక్టర్ జానకి

1110

కావలి, ఏప్రిల్-22: ఉపాధి హామీ పథకంలో భాగంగా మూడు నెలలపాటు విస్తృతంగా పనులు కల్పిస్తామని హామీ ఇచ్చారు జిల్లా కలెక్టర్ జానకి. కావలి మండలం తుమ్మలపెంట గ్రామ శివారులో నిర్మిస్తున్న పశునీటి కుంటల నిర్మాణాన్ని ఆమె పర్యవేక్షించారు. అన్నగారి పాలెంలో నీటికుంటల నిర్మాణాన్ని కూడా పరిశీలించారు. ఉపాధి కూలీలతో మాట్లాడారు. ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లను సరఫరా చేశారు. సరదాగా కాసేపు పలుగు చేతబట్టి పనిలోకి దిగారు. అనంతరం జలదంకి మండలం జమ్మళపాలెం గ్రామంలో కూడా కలెక్టర్ పర్యటించారు. సేద్యపునీటి గుంటల నిర్మాణాన్ని పరిశీలించారు. పైరుని కాపాడుకునేందుకు, పశువుల దాహార్తిని తీర్చేందుకు గుంటలను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు పిలుపునిచ్చారు. జలదంకి గ్రామ శివారులో నిర్మించిన ఫైబర్ గ్లాస్ చెక్ డ్యామ్ ను స్థానిక ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో కలసి పరిశీలించారు కలెక్టర్. ఫైబర్ గ్లాస్ చెక్ డ్యామ్ నిర్మాణం దేశంలోనే రోల్ మోడల్ గా నిలుస్తుందని చెప్పారామె. ఈ పర్యటనలో కలెక్టర్ వెంట ఎస్ఈ సుబ్బారావు, డ్వామా పీడీ హరిత, కావలి ఆర్డీవో తదితరులు ఉన్నారు.