ఏరుదాటి ఏడడుగులు నడిచింది..

1276

ముంచుకొస్తున్న పెండ్లి ముహూర్తం ముందు ఉధృతంగా ప్రవహిస్తున్న వరద. కుటుంబీకులు, గ్రామస్తులు, అటవీ శాఖ అధికారులు కలిసి శుక్రవారం సాహసంతో పెండ్లికూతురిని ఏరు దాటించారు. ఈ ఘటన ఈరోడ్‌ జిల్లా సత్యమంగళం సమీపంలో భవనీ సాగర్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలోని డెంగుమరడ కొండ గ్రామంలో జరిగింది.
ఈ గ్రామానికి వెళ్లాలంటే ఇక్కడి మాయారు (ఏరు) దాటాల్సి ఉంది. ఈ ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా మాయారు ఉధృతంగా ప్రవహిస్తోంది. మాయారును దాటవద్దని అధికారులు హెచ్చరికలు సైతం జారీ చేసి ఉన్నారు. డెంగుమరడ గ్రామానికి చెందిన రైతు అవినాశి. ఇతని భార్య సెల్వి. వీరి కుమార్తె రాసాత్తి (24). బీఏ డిగ్రీ పట్టభద్రురాలు. ఈమెకు కోవై జిల్లా ఆలంకొంబు ప్రాంతానికి చెందిన రంజిత్‌కుమార్‌తో వివాహం నిశ్చయమైంది. వీరి వివాహం ఈ నెల 20వ తేదీ ఆలంకొంబులో జరిపించేందుకు పెద్దలు ఏర్పాట్లు చేస్తున్నారు. వివాహానికి రెండు రోజులే ఉండడంతో మాయారును ఎలా దాటి వెళ్లాలా, పెండ్లి జరుగుతుందా అనే సందేహాలతో రాసాత్తి కుటుంబీకులు ఆందోళన చెందారు.
అటవీ శాఖ అధికారులు వారికి ధైర్యం చెప్పి, గ్రామస్తుల సాయంతో పెండ్లి కూతురు రాస్తాతితో పాటు 15 మంది కుటుంబ సభ్యులను శుక్రవారం బుట్ట పడవలో ఏరు దాటించారు. తర్వాత వారు భవానీసాగర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా రాసాత్తి మాట్లాడుతూ మాయారులో వరద ఉధృతి చూసి నా పెళ్లి ఆగిపోయినట్లే అనుకున్నాను. అధికారులు ధైర్యం చెప్పి సాహసంతో ఏరు దాటించారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నట్టు చెప్పింది. అదే సమయంలో మాయారు దాటి వెళ్లడానికి వంతెన ఏర్పాటు చేయాలి. బస్సు సౌకర్యం కల్పించాలని రాసాత్తి కోరింది.