కురుగొండ్ల పీఠం కూతురుకేనా..?

3259

నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయాల శకం ప్రారంభమైనట్లుంది. వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ కూతురు లక్ష్మీ ప్రసన్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటోంది. లండన్ లో చదివిన లక్ష్మీ ప్రసన్న ఇంతవరకూ రాజకీయ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొన్న సందర్భాలు లేవు. ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మాత్రం మొక్కుబడిగా కాకుండా చిత్తశుద్ధిగా ఇంటింటికీ తిరుగుతోంది. తనే స్వయంగా తెలుగుదేశం పార్టీ కరపత్రాలను పంచుతూ ప్రజల్ని పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకుంటూ సాగిపోతోంది. దీంతో లక్ష్మీ ప్రసన్న, రామకృష్ణ వారసురాలిగా ఉండబోతోందన్న ప్రచారం కూడా ఊపందుకుంది. తెలుగుదేశం పార్టీలో వెంకటగిరి నియోజకవర్గంలో ప్రస్తుతానికి రామకృష్ణకు సరిసమంగా నిలవగలగిన నాయకత్వ స్థాయి కూడా ఎవరికీ లేదు. అందువల్ల రామకృష్ణ ప్రతిపాదిస్తే ఈ దఫా లక్ష్మీ ప్రసన్నే వెంకటగిరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయ్యే అవకాశాలే మెండుగా ఉంటాయి. ఏదయినా రామకృష్ణ ఇష్టాఇష్టాలమీదే ఆధారపడి ఉంటుంది. అయితే లక్ష్మీ ప్రసన్న ఇంటింటికీ తెలుగుదేశం ప్రచారంలో జోరు చూస్తే మాత్రం రాజకీయంగా ఒక గుర్తింపు, ప్రజల్లో తనకంటూ ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకునే ప్రయత్నమే కనపడుతోంది. దీంతో ఆమె ఎన్నికల రాజకీయ అరంగేట్రంపై సహజంగానే గుసగుసలు వినిపిస్తున్నాయి.

1