కోర్టు దెబ్బతో కొండదిగిన ధరలు..

8328

తిరుమల కొండమీద వివిధ హోటళ్లలో అడ్డగోలు ధరల దోపిడీ నిలిచిపోయింది. ఇప్పటి వరకూ రూ.25 పలికిలిన రెండు ఇడ్లీల ధర రూ.7.50కు దిగివచ్చింది. ఏకంగా రూ.15 అమ్మిన టీ ఇప్పుడు రూ.5కు దొరుకుతోంది. రూ.100 పూర్తి భోజనం రూ.31కు తగ్గింది. ఇలా వివిధ రకాల ఆహార పదార్థాల ధరలు సగానికిపైగా తగ్గిపోయాయి. అంతేకాకుండా ఈ ధరలను అన్ని హోటళ్ల ముందు పట్టికల్లో బహిరంగా ప్రదర్శిస్తున్నారు. పట్టికలో ధరల కంటే ఎక్కువ ధరకు అమ్మితే… ఎవరికి ఫిర్యాదు చేయాలో సూచించేలా ఫోన్‌ నెంబర్లు వేస్తున్నారు.
గతంలో తిరుమలలో హోటళ్లలో ఆహారపదార్థాల ధరలకు అడ్డూ అదుపు ఉండేది కాదు. భక్తులు కోరుకున్నది తిన్నాక.. వారు చెప్పినంత డబ్బు కట్టాల్సి వచ్చేది. ఈ పరిస్థితితో భక్తులు దోపిడీకి గురవుతున్నారంటూ కొన్ని ప్రజాసంఘాలు ఉమ్మడి హైకోర్టులో ఫిర్యాదు చేశాయి. దీనిపై ఇటీవల కోర్టు తితిదే ఉన్నతాధికారులకు అక్షింతలు వేసింది. కొండపైకి వచ్చే భక్తుల నుంచి హోటళ్లు దర్జాగా వసూలు చేస్తుంటే మీరు ఏం చేస్తున్నారని తితిదే ఉన్నతాధికారులను ప్రశ్నించింది. వెంటనే దీనికి అడ్టుకట్ట వేసేందుకు తీసుకుంటున్న చర్యలపై తమకు నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనికి ప్రతిస్పందించిన ఉన్నతాధికారులు వెంటనే చర్యలకు శ్రీకారం చుట్టారు. హోటల్‌ యజమానులు, తితిదే రెవెన్యూ, ఎస్టేట్‌, ఇతర శాఖల అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. తిరుమలలో సామాన్య భక్తులకు సాంత్వన చేకూరేలా తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. ఈ క్రమంలో హోటల్‌ యజమానులు అధిక ధరలను తగ్గించాలని, ఆయా ధరల పట్టికలను హోటళ్ల ముందు అందరికీ కనిపించేలా వేలాడదీయాలని, దీన్ని అతిక్రమించినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రస్తుతం తిరుమలలోని ప్రతి చిన్న హోటల్‌లోనూ ధరల తగ్గి, పట్టికలు కనిపిస్తున్నాయి.