ఖాకీ వీరంగం..

1803

మ‌ద్యం మ‌త్తులో ఓ ఏఎస్ఐ వీరంగం సృష్టించాడు. ఫిర్యాదు చేయ‌డానికి వ‌చ్చిన అర్జీదారుల ప‌ట్ల దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డంతో వారు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏఎస్ఐను ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించి వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. నెల్లూరు జిల్లా ద‌గ‌ద‌ర్తి పోలీసు స్టేష‌న్‌లో ఈ ఘ‌ట‌న చోటుచేసుకోగా…అత‌నిపై చట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు తెలిపారు.

ద‌గ‌ద‌ర్తి పోలీసు స్టేష‌న్‌లో ఏఎస్ఐగా ప‌నిచేస్తున్న పోల‌య్య గ‌త కొంత కాలంగా ప‌లు ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఆయ‌న మ‌రో విమ‌ర్శ‌కు గుర‌య్యారు. గ‌త రాత్రి పోలీస్ స్టేష‌న్‌కు ఫిర్యాదు చేయ‌డానికి అర్జీదారులు వ‌చ్చారు. ఫిర్యాదు చేస్తుండ‌గా… అప్ప‌టికే మ‌ద్యం మ‌త్తులో ఉన్న ఏఎస్ఐ పోల‌య్య అర్జీదారుల‌పై దురుసుగా ప్ర‌వ‌ర్తించారు. దుర్భాష‌లాడారు. స్టేష‌న్ ఎస్ఐ అడ్డుప‌డ్డా ఇష్టానుసారంగా ప్ర‌వ‌ర్తించాడు. దీంతో అర్జీదారులు జిల్లా ఎస్పీ రామ‌కృష్ణ‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్పీ వెంట‌నే ఏఎస్ఐను వైద్య‌ప‌రీక్ష‌ల‌కు త‌ర‌లించాల‌ని ఎస్సైను ఆదేశించారు. వైద్య‌ప‌రీక్ష‌ల‌కు తీసుకెళ్లేందుకు య‌త్నించినా… పోల‌య్య అడ్డుప‌డ్డాడు. అయినా పోలీసులు ఆయ‌న‌ను కావ‌లి ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించి వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఇదిలా ఉంటే ఇత‌నిపై ఇప్ప‌టికే కావ‌లి 1 టౌన్ లో కేసు న‌మోదైఉంది. బిట్ర‌గుంట స్టేష‌న్‌లో సైతం ఇలాంటి ఆరోప‌ణ‌లు గ‌తంలో ఆయ‌న ఎదుర్కొంటున్నారు. కాగా… ఆయ‌న‌పై శాఖా ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని చెప్తున్నారు అధికారులు.