ఖైదీ కలెక్షన్లపై లీకేజీ ప్రభావం ఎంత?

901

ఖైదీ నెంబర్ 150 సినిమా రిలీజ్ రోజే వీడియో సాంగ్స్ నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. వాట్సప్ గ్రూపుల్లో పూర్తి నిడివి ఉన్న పాటలు దర్శనమిస్తున్నాయి. థియేటర్లో రికార్డ్ చేసిన వీడియోల్ని ఇప్పటికే చాలామంది చూసేశారు. ఈ మధ్య కాలంలో ఏ సినిమాకూ ఇలా జరగలేదు. సినిమా విడుదలైన తొలి రోజే ఆన్ లైన్లో ఈ సినిమా పాటలు లీక్ అయిపోవడం పెద్ద మైనస్సే అంటున్నారు విశ్లేషకులు. అరబ్ దేశాల్లో ఈ సినిమాను పైరసీ చేసేసినట్లు తెలుస్తోంది. కాకపోతే సినిమా ఎక్కడా లీక్ కాలేదు కానీ.. పాటలన్నింటినీ నెట్లో పెట్టేశారు. యూట్యూబ్ లో ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా అనుకుంటున్న పాటలన్నింటినీ రకరకాల పేర్లతో పెట్టేశారు. వాట్సాప్ లో అమ్మడు కుమ్ముడు పాట హల్ చల్ చేస్తోంది. చిరు-చరణ్ కలిసి చేసిన ఈ పాట బయటికి రావడం కచ్చితంగా ‘ఖైదీ నెంబర్ 150’కు ఎదురు దెబ్బే. చిరు రీఎంట్రీ మూవీలో కంటెంట్ కంటే కూడా ఎక్కువ చిరు డ్యాన్సులు ఎలా చేశాడన్న దాని మీదే జనాలకు ఎక్కువ ఆసక్తి ఉంది. ఆ ఆసక్తితోనే థియేటర్లకు పరుగులు పెడుతున్నారు. సినిమాకు రిపీట్ వాల్యూను తీసుకొచ్చేది కూడా పాటలే. ఐతే ఆ పాటల్నే లీక్ చేసేయడంతో కచ్చితంగా కొంత ప్రతికూల ప్రభావం ఉంటుందనడంలో సందేహం లేదు.