గుడికి వెళ్ళినప్పుడు శఠగోపం ఎందుకు తీసుకోవాలి?

1637

ప్రతిరోజూ గుడికి వెళ్లే పద్దతిని మన పెద్దలు మనకు చిన్నతనం నుంచే అలవాటు చేశారు. నిత్యం గుడికి వెళ్లి తమ కోరికలను భగవంతునికి చెప్పుకుంటారు  భక్తులు.  దేవాలయంలో దర్శనం అయ్యాక  ప్రదక్షిణలు చేసి,  తీర్థం, శఠగోపనం తీసుకుంటారు కొందరు. అయితే చాలా మంది దేవుడి  దర్శనం చేసుకున్నాక వెళ్లిపోతుంటారు. కొద్ది మంది మాత్రమే ఆగి, శఠగోపనం పెట్టించుకుంటారు.

శఠగోపనాన్నే  కొన్ని ప్రాంతాల వారు శఠగోపం, శడగోప్యం అంటారు. శడగోప్యం అంటే అత్యంత గోప్యమైనది అని అర్థం. అంటే అది అత్యంత రహస్యం. అందుకే అది  పెట్టే పూజారికి కూడా విన్పించనంతగా కోరకను తలుచుకోవాలంటారు మన పెద్దలు.  మానవునికి శత్రువులైన కామమూ, క్రోధమూ, లోభమూ, మోహమూ, మదమూ, మాత్సర్యముల వంటి వాటికి ఇక నుండి దూరంగా ఉంటామని తలుస్తూ తలవంచి తీసుకోవటము మరో అర్థం.

శఠగోపంను పంచలోహాలైన వెండి , రాగి, కంచు మొదలైన వాటితో తయారు చేస్తారు. శఠగోపం వలయాకారంలో ఉంటుంది. వాటిపై భగవంతుని పాదాల గుర్తులు  ఉంటాయి. శఠగోపం తలపై పెట్టినప్పుడు పాదాలు మన తలను తాకుతాయి. అలాకాక నేరుగా పాదాలనే తలపై ఉంచితే అవి మొత్తం తలని తాకడానికి అనుకూలంగా ఉండదు కాబట్టి శఠగోపాన్ని వలయాకారంలో తయారుచేసి పైన పాదుకలు ఉంచుతారు.  అంటే మనము కోరికలను శఠగోపం పెట్టినప్పుడు తలుచుకుంటే భగవంతుడి పాదాల వద్ద చెప్పుకున్నట్లే.

శఠగోపనం తల మీద ఉంచినప్పుడు… శరీరంలోఉన్న విద్యుత్‌, దాని సహజత్వం ప్రకారం శరీరానికి లోహం తగిలినప్పుడు విద్యుదావేశం జరిగి, మనలోని అధిక విద్యుత్‌ బైటికెళుతుందని ఆధునిక పరిశోధకులు చెబుతున్నారు. లోహాలకు వేడిని సంగ్రహించే శక్తి ఉంటుంది. అందుకే తలమీద పెట్టగానే తలలో వేడిని ఇది సులువుగా లాగేస్తుందని,  తద్వారా శరీరంలో ఆందోళన, ఆవేశమ తగ్గుతాయని అంటున్నారు.  కాబట్టి గుడికి వెళ్లినప్పుడు శఠగోపనం పెట్టించుకుంటం మరవద్దు.