టీటీడీ పెద్దల పాదసేవకే అంకితమా? పేదలు పట్టరా..?

709

పెళ్లి కూతుర్ని చేయాలని అమ్మాయిని బ్యూటీ పార్లర్ కి తీసుకుపోతే అసలు రూపం పోయి కోతి రూపం వచ్చింది. అలా ఉంది టీటీడీ అధికారుల పరిపాలన. వీఐపీల దర్శనాలకి విధానాలు రూపొందించడంలో నిరంతరం తలమునకలై ఉండే టీటీడీ అధికారులు సామాన్య భక్తుల విషయానికొచ్చేసరికి భక్తుల సౌకర్యంకోసం చేసే ప్రతి మార్పూ ఆ భక్తుల సహనానికి పరీక్షలా ఉంది. దర్శనం విషయాల్లో మార్పు సంగతి ఎలా ఉన్నా.. కొత్త కష్టాలను తెచ్చిపెడుతోంది. ఎన్నిరకాలుగా సామాన్య భక్తులను ఇబ్బంది పెట్టాలో, అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడం అధికారులకు అలవాటైపోయింది. తాజాగా టీటీడీ అధికారులు సర్వ దర్శనం విషయంలో రూపొందించిన నిబంధనలు చండాలంగా ఉన్నాయి. ఈ సర్వదర్శనం పేరుతో టైమ్ స్లాట్ ఇచ్చే కార్యక్రమం అవకతవకలుగా ఉంది. గతంలో బాగా రద్దీ సమయాల్లో కూడా ఉచిత దర్శనానికి పోయిన భక్తులు 10గంటల్లోపల తిరిగొచ్చేవారు. అయితే ఇప్పుడు సామాన్య భక్తుడికి సర్వ దర్శనం నరకప్రాయంగా తయరైందనడానికి నిన్న జరిగిన సంఘటనే ఉదాహరణ. నిన్న ఉదయం రెండో క్యూ కాంప్లెక్స్ లోని 18, 19 కంపార్ట్ మెంట్లలోకి దర్శనానికి వచ్చిన భక్తులకు ఈరోజు ఉదయం 11గంటలకు దర్శనం టోకెన్లు ఇచ్చి పంపారు. అంటే 24గంటలు వేచిఉంటే దర్శనం టోకెన్లు ఇచ్చారు. ఆ భక్తులు ఒకటో కాంప్లెక్స్ లోకి వెళ్లమన్నారు. అంటే మళ్లీ ఎప్పుడు దర్శనం చేయిస్తారో అధికారులకు తెలియదు. అడిగితే సమాధానం లేదు. దీంతో రెండో కాంప్లెక్స్ లో ఆఫీస్ కి వెళ్లి నిరసనకు దిగారు. ఈ రోజు ఉదయం సర్వ దర్శనంకోసం రెండో కాంప్లెక్స్ లోకి వెళ్లిన భక్తులకు రేపు రాత్రి 9గంటలకు దర్శన సమయం ఇచ్చారు. అంటే 33 గంటల తర్వాత దర్శనం కోసం వారిని క్యూలోకి అనుమతిస్తారు. ఆ తర్వాత దర్శనం ఎప్పుడవుతుందో ఆ గోవిందుడికే ఎరుక. దూర ప్రాంతాలనుంచి స్వామి దర్శనంకోసం వచ్చే భక్తులకు ఈ తలతిక్క విధానాలు నరకప్రాయంగా తయారవుతున్నాయి. దీని ప్రకారం చూస్తే అధికారులు సామాన్యుడి దర్శనంకోసం ఆలోచిస్తున్నామని తలలు పట్టుకుని ఇటువంటి తలతిక్క విధానాలను రూపొందిస్తున్నారు. పాత విధానాలనే అమలులో ఉంచితే ఎట్టి పరిస్థితుల్లోనూ ఉచిత దర్శనం 10గంటలకు మించిన సందర్భం లేదు. దర్శనం విషయంలో అధికారులు చేసే మార్పులు వీఐపీలకు మాత్రమే ఎప్పుడూ అనుకూలంగా ఉంటాయి. సామాన్య భక్తులకు ఇబ్బంది కరంగానే ఉంటాయి. గోవిందుడి సేవ పెద్దలకే పరిమితమయ్యే పరిస్థితి తీసుకొచ్చారు. సామాన్యుడు గోవిందుడ్ని దర్శించుకోవాలంటే ఎన్ని కష్టాలు పడాలో, ఎన్ని బాధలు అనుభవించాలో టీటీడీ అధికారులకు తెలియడంలేదు. తెలిసినా పట్టించుకోవడంలేదు.