తమిళనాడులో ఘోరం..

577

పర్వతారోహణకు వెళ్లిన విద్యార్థినులు తొమ్మిదిమంది అడవిలో మంటలకు ఆహుతయ్యారు. ఆదివారం తమిళనాడు లోని తేరి జిల్లాలో కురంగణి ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. చెన్నైలోని ట్రెక్కింగ్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం సందర్భంగా ఐటీ ఉద్యోగినిలు, విద్యార్థినులు ట్రెక్కింగ్ కి వెళ్లారు. మొత్తం 36మంది బృందం అడవిలో ట్రెక్కింగ్ కి వెళ్లింది. సాయంత్రం తిరొగొచ్చే క్రమంలో ఒక్కసారిగా అడవిలో కార్చిచ్చు రేగింది. అమ్మాయిల బృందం మొత్తం మంటల్లో చిక్కుకుంది. బైటపడే దారే లేదు, చుట్టూ అడవి, అంతా మంటలు.. మంటలు దగ్గరకి వచ్చే క్రమంలో ఎటు పరిగెడుతున్నామో తెలియక అందరూ తలోదిక్కయ్యారు. ఒక్కొక్కరే మంటలకు ఆహుతయ్యారు. వెంటనే అటవీశాఖ సిబ్బంది, సమీప ప్రాంతాల ప్రజలు అక్కడికి చేరుకున్నారు. కార్చిచ్చును అదుపు చేసే ప్రయత్నాలతోపాటు విద్యార్థినులను రక్షించే చర్యలు కూడా చేపట్టారు. 15మందిని హెలికాప్టర్ల ద్వారా భద్రతా దళాలు రక్షించగలిగాయి. మొత్తం 27మందిని కాపాడారు. వీరిలో 10మంది స్వల్ప గాయాలతో బైటపడగా, 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. 9మంది చనిపోగా.. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. పర్వతారోహణకు వెళ్లినవారు పోలీసులనుంచి గాని, అటవీశాఖ నుంచిగాని అనుమతి తీసుకోలేదని అధికారులు చెబుతున్నారు.