దెబ్బకు ఠా… రొయ్యల ముఠా…

2966

పోలీసులు అనుకుంటే సాధించలేనిది లేదు.. అలానే అనుకున్నారు.. కష్టమైనా పది గంటలపాటు శ్రమించి రొయ్యల దొంగలను పట్టుకోగలిగారు.. ఇదంతా సినిమాని తలపిస్తోంది. వివరాల్లోకెళితే.. సూళ్లూరుపేటకు చెందిన ఓ వ్యక్తి ఒక ముఠాను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో 12 మంది ఉన్నారు. వీరందరూ రాత్రివేళ రొయ్యల గుంటల వద్దకెళ్లి రొయ్యలను చోరీ చేసి ఆటోలో ఇతర ప్రాంతాలకు తరలించి విక్రయించేవారు. ఈ నేపథ్యంలో చిట్టమూరు ప్రాంతం నుంచి మంగళవారం రాత్రి ఆటోలో రొయ్యలను తీసుకొస్తుండగా అక్కడ శిక్షణ ఎస్సై వాసు గస్తీలో ఉన్నారు. పోలీసు వాహనాన్ని గుర్తించిన ఆటోలోని వారు అందులోని రొయ్యల బస్తాలను కింద పడేసి వేగంగా వెళ్లిపోయారు. ఇంతలో శిక్షణ ఎస్సై జరిగిన విషయాన్ని అక్కడి ఎస్సైకి చేరవేశారు. ఆయన వెంటనే రాత్రి 2 గంటల సమయంలో సూళ్లూరుపేట ఎస్సై గంగాధర్‌కు సమాచారం చేరవేశారు. దాంతో సూళ్లూరుపేట ఎస్సై సిబ్బందిని వెంటబెట్టుకుని ఆబాక వద్దకెళ్లారు. వీరు చాలాసేపు అక్కడ ఉన్నా ఆటో రాలేదు. దాంతో వేలికాడు వరకు వెళ్లారు. ఇంతలో అక్కడికి చిట్టమూరు ఎస్సై, వారి సిబ్బంది వచ్చారు. అక్కడ గ్రామస్థులను ఆటో గురించి ఆరా తీయగా వచ్చి వెళ్లిందని చెప్పారు. పోలీసులు ఆటో బాటను చూస్తూ ముందుకెళ్లారు. కొంతదూరం వెళ్లాక ముళ్లచెట్ల మధ్య ఆటో ఉండటాన్ని కనుగొన్నారు. దాని నంబరు ఆధారంగా అది సూళ్లూరుపేటకు చెందిన ఆటోగా గుర్తించారు. అంతకు ముందు పోలీసులు కోటపోలూరు మీదుగా వెళ్లేటపుడు సూళ్లూరుపేటకు చెందిన ఓ వ్యక్తి బుల్లెట్‌ మోటార్‌సైకిల్‌పై అక్కడ ఉండటాన్ని గుర్తించారు. ఆటో నంబరు తెలుసుకున్న తర్వాత పోలీసులకు ఆ వ్యక్తిపై అనుమానం వచ్చింది. దాంతో నేరుగా సూళ్లూరుపేట కేఆర్పీ సమీపంలో ఉన్న ఆ వ్యక్తి ఇంటికెళ్లి అక్కడ నిలిపి ఉన్న మోటార్‌సైకిల్‌ను పరిశీలించారు. దాని ఇంజిన్‌ వేడిగా ఉన్నట్లు గుర్తించారు. దాంతో వారి అనుమానం మరింత బలపడింది. ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటకు వచ్చింది. ఆ వ్యక్తి ద్వారా దొంగలతో మాట్లాడించారు. పులికాట్‌ సరస్సు మీదుగా కుదిరి వద్దకు వస్తున్నామని వారు చెప్పారు. ఈలోగా సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ విజయకృష్ణ, ఎస్సై, వారి సిబ్బంది అందరూ కలిసి కుదిరి వద్ద మాటు వేశారు. అయితే పోలీసులు ఉన్న విషయం తెలుసుకున్న దొంగలు వెంటనే అక్కడి నుంచి పులికాట్‌ సరస్సు మీదుగా వాటంబేడు వైపు పరుగులు తీశారు. అయినా దొంగల్లో ఇద్దర్ని పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. మిగిలిన వారు పరుగులు తీశారు. పులికాట్‌ సరస్సులో ముందు దొంగలు.. వారిని వెంబడిస్తూ పోలీసులు.. ఇలా సుమారు 20 కిలోమీటర్ల దూరం వెళ్లారు. ఈలోగా ఎస్సై గంగాధర్‌ వేనాడుకు చెందిన వాసు మొదలియార్‌కు సమాచారమిచ్చారు. ఆయన గ్రామస్థులు పలువుర్ని వెంటబెట్టుకుని ఓ పడవలో బయలుదేరి దొంగలకు ఎదురు వచ్చారు. వెనుక పోలీసులు.. ముందు వేనాడు గ్రామస్థులు ఇక చేసేది లేక ఆరుగురు దొంగలు దొరికిపోయారు. వారిని తీసుకుని పోలీసులు సూళ్లూరుపేటకు వచ్చారు. ఇంతలో వాకాడు సీఐ, చిట్టమూరు పోలీసులు రావడంతో వారికి దొంగలను అప్పగించారు. వాటంబేడు తదితర ప్రాంతాలకు చెందిన వారు ఈ ముఠాలో ఉండటంతో అప్పుడే రాజకీయ నేతలు పోలీసులపై పైరవీలు చేయడం ప్రారంభించారు.