నకిలీ డాక్యుమెంట్ల కేసుని ఛేదించిన నెల్లూరు జిల్లా పోలీసులు..

8103

టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్ రెడ్డి చేసిన అక్రమాస్తుల ఆరోపణలు అవాస్తవమని తేల్చారు పోలీసులు. రాజకీయ ప్రత్యర్థులను ఎంపిక చేసుకుని ఒకరి రహస్యాలు మరొకరికి తెలియజేస్తామంటూ డబ్బులు తీసుకుని నకిలీ డాక్యుమెంట్లు అందించే ముఠాని అరెస్ట్ చేశారు. సోమిరెడ్డి ఫిర్యాదు మేరకు విచారణ ప్రారంభించిన పోలీసులు ఆయన పేరుమీద నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్ ను ఈ కేసులో ప్రధాన నిందితుడుగా తేల్చారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఇతని దగ్గరనుంచి నకిలీ పాస్ పోర్ట్ లు, నకిలీ ఇమ్మిగ్రేషన్ సర్టిఫికెట్లు, ల్యాప్ ట్యాప్ లు స్వాధీనం చేసుకున్నారు. మలేసియా, సింగపూర్ ల్లో పనిచేసిన చిరంజీవి అక్రమ సంపాదనకోసం ఈ డాక్యుమెంట్లు సృష్టించాడు. నకిలీ డాక్యుమెంట్ల తయారీలో ఇతనికి సహకరించిన టి.వెంకటకృష్ణన్, రబ్బర్ స్టాంప్ లు తయారు చేసి ఇచ్చిన జి.హరిహరన్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ తిరువళ్లూరుకు చెందినవారు.