నెల్లూరు జిల్లాలో చేజింగ్ సీన్..

3049

కుదువపెట్టిన బంగారాన్ని విడిపించుకుని ఓ వ్యక్తి సంచిలో దాన్ని తీసుకుని ఇంటికి వెళ్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న ఇద్దరు వ్యక్తులు పక్కా ప్లాన్ ప్రకారం అతడ్ని బైక్ పై వెంబడించారు. తీరా ఇంటికి వెళ్లేలోపే ఆ బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ క్రమంలో దొంగలు బాధితుడ్ని కడుపులో పొడవడంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూరు మండలం నర్సాపురం వాసిలి వద్ద జరిగింది. సీఐ ఖాజావలి తెలిపిన వివరాల ప్రకారం ఆత్మకూరు సోమశిలరోడ్డు సెంటర్‌లో కూరగాయల వ్యాపారం చేసే ఎన్‌. ప్రసాద్‌ తన బంగారాన్ని నెల్లూరులో కుదువ పెట్టారు. మంగళవారం వెళ్లి ఆ బంగారు నగలు తీసుకొని ద్విచక్రవాహనంపై వస్తున్నారు. ఈ క్రమంలో సంగం వద్ద టీ తాగేందుకు ఆగారు. అక్కడ ఇద్దరు తనను అదే పనిగా చూడటం గమనించారు. తిరిగి వస్తున్న క్రమంలో పల్సర్‌ వాహనంపై ఆ ఇద్దరు అపరిచితులైన వ్యక్తులు అతడిని అనుసరించారు. దీంతో ఇంట్లో వారికి ఫోన్‌ చేసి చెప్పారు. దాంతో వెంబడించినవారు వాసిలి ఆత్మకూరు మధ్యలో అతని ద్విచక్రవాహనాన్ని అడ్డగించి బలవంతంగా ఆపారు. ప్రసాద్‌ ప్రతిఘటించారు. వారు తమ వద్ద ఉన్న కత్తితో ప్రసాద్‌ను పొడిచారు. అతని వద్ద ఉన్న ఐదు సవర్ల బంగారం, రూ.నాలుగువేల నగదు, చరవాణి తీసుకొని పరారయ్యారు. బాధితుడి అత్త పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి పోలీసులకు విషయం చెప్పింది. సీఐ ఖాజావలి సిబ్బందితో ఘటన స్థలానికి వెళ్లారు. బాధితుణ్ని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.