నెల్లూరు డాక్టర్ కి 20లక్షల పెనాల్టీ..

3889

నెల్లూరులో ఓ డాక్టర్ చేతకాని ఆపరేషన్ చేసి ముక్కుపచ్చలారని ఓ యువతి జీవితాన్ని చిదిమేశాడు. ఆడుతూ పాడుతూ గడపాల్సిన యవ్వనాన్ని అవిటితనంగా మార్చేశాడు. పొదలకూరు మండలం ముదిగేడుకి చెందిన సుజన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం చదువుతుండగా ఆటో యాక్సిడెంట్ అయింది. కాలు, చెయ్యి దెబ్బతినడంతో పొగతోటలోని విజయ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ప్రసాద్ అనే ఎముకల స్పెషలిస్ట్ ఆపరేషన్ చేయాలని చెప్పి కాలు, చెయ్యి ఆపరేషన్ చేశాడు. అయితే ఆపరేషన్ చేసిన రోజునుంచీ అమ్మాయి పరిస్థితి విషమించడంతో చెన్నైకి తీసుకెళ్లారు. అక్కడి డాక్టర్లు ఆపరేషన్ చేయడంలో లోపం ఉందని, అందువల్లనే ఇన్ఫెక్షన్ సోకి పరిస్థితి విషమించిందని అమ్మాయికి కాలు తీసేయకపోతే ప్రాణానికే ప్రమాదం అని చెప్పారు. దీంతో విధిలేని పరిస్థితుల్లో అమ్మాయి కాలు తొలగించేశారు. దాదాపు నెలరోజులపాటు ఆస్పత్రిలో 10లక్షల రూపాయలు ఖర్చుపెట్టి అవిటి కూతుర్ని ఇంటికి తీసుకొచ్చుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా తన బిడ్డ వికలాంగురాలైపోయిందని ఆమె జీవితాన్ని పొట్టనపెట్టుకున్నారని తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. దీనిపై నెల్లూరు జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించగా కొన్నిరోజుల క్రితం ఫోరం బాధితురాలు సుజనకు అన్ని ఖర్చులు కలిపి 20లక్షల రూపాయలు పరిహారాన్ని 12శాతం వడ్డీతో కలిపి చెల్లించాలని తీర్పు చెప్పింది. ఈ తీర్పు నెల్లూరు జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యానికి చెంపపెట్టుగా మారింది. చేతొచ్చి, చేతకాని వైద్యం చేసి రోగుల ప్రాణాలకు ప్రమాదం తెచ్చిపెడుతున్న వారికి కనువిప్పు కావాలి. నెల్లూరు జిల్లాలో ఇంత పెద్ద మొత్తంలో వైద్యుల నిర్లక్ష్యంపై జరిమానా వేయడం ఇదే మొదటిసారి. బాధితురాలు 15ఏళ్ల వయసున్న బాలిక కావడం, చదువుకుంటుండటం, ఆ బాలికకు బంగారు భవిష్యత్ ఉండటం వీటన్నింటినీ వైద్యుడి నిర్లక్ష్యం కారణంగా పొట్టనపెట్టుకోవడం వీటిని దృష్టిలో పెట్టుకుని ఫోరం కఠినంగానే తీర్పు చెప్పింది.