నెల్లూరోళ్లని మాల్ లో ఇలా దోచేస్తున్నారు.

10401

మహానగరాలే కాదు నెల్లూరు షాపింగ్ మాల్స్ లో కూడా పార్కింగ్ పేరుతో దోపిడీ జరుగుతోంది. నెల్లూరులో వున్న పెద్ద షాపింగ్ మాల్ MGBలో పార్కింగ్ పేరుతో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఈ దోపిడీకి భయపడే కొంతమంది తమ వాహనాలను రోడ్డు పక్కన నిలిపి, ఒకరకంగా ట్రాఫిక్ అంతరాయానికి కూడా కారణమవుతున్నారు. షాపింగ్ మాల్ లో అసలు పార్కింగ్ ఫీజు వసూలు చేయడమే చట్ట విరుద్దమైతే, మూడు గంటలు దాటితే నిముషానికి ఇంత మొత్తమంటూ దోచేస్తున్నారు. దీనికి సాక్ష్యంగా ఇక్కడ ఒక రసీదు వుంది చూడండి. MGB మాల్లో మూడు గంటలు సినిమా తర్వాత, పైనుంచి కిందకు వచ్చేసరికి కనీసం పది నిముషాలు పడుతుంది. దానికి కూడా లేట్ ఫీజు పేరుతొ ఏడూ నిముషాలకు మరో పది రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే మా కంప్యూటర్ ని అడగాలంటూ హేళనగా జవాబు నిస్తున్నారు. నెల్లూరు ప్రజలు అమాయకులనుకున్నారేమో ఇలా నిలువు దోపిడీ చేస్తున్నారు. 2003లో హై కోర్టు ఆదేశాల ప్రకారం మాల్స్, షాపింగ్ కాంప్లెక్స్ లలో పార్కింగ్ స్థలాలు ప్రజల కోసం వినియోగించాల్సి వుంది. వీటిని కామన్ యుటిలిటీగా పరిగణిస్తారు. అందువల్ల వీటిలో పార్కింగ్ ఫీజు వసూలు చేయడం నిషిద్ధం. చట్టరీత్యా నేరం. ఇటీవల హైదరాబాద్ లో పార్కింగ్ వసూలు చేస్తున్న ఓ కాంప్లెక్స్ యాజమాన్యంపై క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. షాపింగ్ మాల్స్ లో పార్కింగ్ ఫీజుకు డబ్బులు వసూలు చేసే ఈ దోపిడీ విధానంలో పార్కింగ్ స్లిప్ పోగొట్టుకుంటే 100 రూపాయలు ఫైన్. బండి పోయినా, లేదంటే డామేజ్ జరిగినా షాపింగ్ మాల్ యాజమాన్యానికి మాత్రం సంభంధం లేదు. అడిగే వాళ్ళు, తిరగబడే వాళ్ళు లేనంత కాలం ఈ దోపిడీ తప్పదేమో. నెల్లూరు షాపింగ్ మాల్లో ప్రతీరోజూ పార్కింగ్ పేరుతో లక్షల్లో దోపిడీ జరుగుతోంది. అధికారులు మాత్రం ఫిర్యాదు చేస్తే, ఒకశాఖ మీద మరో శాఖపై భాద్యతలు నెట్టేస్తూ, నెల్లూరు ప్రజల నెత్తిన పార్కింగ్ భారాన్ని మోపుతున్నారు.