నో క్యాష్.. ఔటాఫ్ సర్వీస్..

1061

నెల్లూరు నగరంలో దాదాపు సగం ఏటీఎంలు మూతపడ్డాయి. మిగతా చోట్ల డబ్బులున్నా.. బారెడు క్యూలైన్లు కనిపించాయి. సోమవారం ఉదయం సగటు నగరవాసి నగదుకోసం నానా కష్టాలు పడ్డాడు. నోట్ల రద్దు తర్వాత తరచూ ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా వారాంతాల్లో నగదు కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఆదివారం మధ్యాహ్నం నుంచే సమస్య మొదలవుతోంది. సోమవారం పూర్తిగా ఏటీఎంలు పనిచేయడంలేదు. సోమవారం రోజున బ్యాంక్ ఏజెన్సీలు ఏటీఎంలలో నగదు నింపిన తర్వాతే వినియోగదారుల సమస్య పరిష్కారమవుతోంది. అది కూడా అంతంతమాత్రంగానే. నోట్ల రద్దు తర్వాత పరిమితంగానే కొత్త నోట్లను ఆర్బీఐ, బ్యాంక్ ల ద్వారా అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఉన్న నోట్లు కాస్తా వినియోగంలోకి వచ్చేశాయి. పాత నోట్ల స్థానంలో అదే స్తాయిలో కొత్త నోట్ల ముద్రణ ఇంకా పూర్తి కాకపోవడంతో నగదు కొరత వేధిస్తోంది. మరోవైపు నగదు రహిత లావాదేవీలు కూడా ఊపందుకోలేదు. నోట్ల రద్దు టైమ్ లో పేటీఎం వాడకం, కార్డ్ ద్వారా చెల్లింపుల జోరు కనిపించింది. ప్రస్తుతం కార్డ్ చెల్లింపులపై అటు దుకాణదారులు, ఇటు వినియోగదారులు పెద్దగా ఇష్టపడటం లేదు. కార్డ్ చెల్లింపులపై ట్యాక్స్ లను పూర్తిస్థాయిలో ఎత్తివేయకపోవడంతో ఎరూ ఆసక్తి చూపించడంలేదు. దీంతో అందరూ నగదు వాడకంపైనే దృష్టిపెట్టారు. అందుకే ఏటీఎం కష్టాలు జనాల్ని వెంటాడుతున్నాయి.