ప్రేమజంట ఆత్మహత్య..

1022

కలసి బతకలేం కనీసం కలసి అయినా చనిపోతాం అనే ఉద్దేశంతో ఒకే ఉరితాడుతో చెట్టుకు ఉరేసుకుని ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. అబ్బాయి వయసు 21, పేరు ప్రవీణి కుమార్. ఐటీఐ పూర్తి చేసి హైదరాబాద్ లో ప్రైవేట్ కంపెనీలు పనిచేస్తున్నాడు. అమ్మాయి పేరు మంజుల, వయసు 18ఏళ్లు, ఇంటర్ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. వీరి ప్రేమను పెద్దలు నిరాకరించడంతో తెలిసీ తెలియని వయసులో ప్రాణాలు తీసుకున్నారు. ఈ సంఘటన సోమవారం వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలంలోని పోల్కంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. పోల్కంపల్లి గ్రామానికి చెందిన కోటం అనంతప్ప, నర్సమ్మల పెద్ద కుమారుడు కోట్టం ప్రవీణ్‌కుమార్‌(21) రెండేళ్ల క్రితం ఐటీఐ పూర్తి చేసి హైదరాబాద్‌లో ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన భీమప్ప, బుగ్గమ్మలకు ఏకైక కుమార్తె ఎర్రోళ్ల మంజుల(18) ఇంటర్‌ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. ఏడాదిగా ప్రవీణ్‌కుమార్, మంజుల ప్రేమించుకుంటున్నారు. ఈ విషయం కొద్ది నెలల క్రితం ప్రవీణ్‌ ఇంట్లో విషయం తెలిసింది. తాము కుదిర్చిన పెళ్లి చేసుకోవాలని అతడిని మందలించారు.
అయితే మంజులకు వారం రోజుల క్రితం కొడంగల్‌ మండలం రావల్‌పల్లికి చెందిన ఓ వ్యక్తితో వివాహం కుదిరింది. మరో మూడు రోజుల్లో నిశ్చితార్థం పెట్టుకున్నారు. ఈ విషయం మంజుల హైదరాబాద్‌లో ఉన్న ప్రవీణ్‌కు చెప్పడంతో ప్రవీణ్‌ ఆదివారం రాత్రి 9గంటలకు పోల్కంపల్లి గ్రామానికి వచ్చాడు. ఇంట్లో రాత్రికి భోజనం చేసి బయటపడుకుంటానని చెప్పి వెళ్లిపోయాడు. మంజుల కూడా కుటుంబసభ్యులు పడుకున్న తర్వాత రాత్రి 11గంటల వరకు టీవీ చూసి బయటకు వెళ్లిపోయింది. అయితే కుమారుడు కనిపించకపోవడంతో ఉదయం 4గంటలకు ప్రవీణ్‌ తండ్రి పొలం వద్దకు వెళ్లగా.. వారిద్దరూ చెట్టుకు ఉరేసుకుని కనిపించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై చంద్రశేఖర్‌ పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కొడంగల్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.