బెల్లం బదులు.. చక్కెర పొంగలి

332

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి నిత్య నైవేద్య ప్రసాదం తయారీలో బెల్లం కొరత ఏర్పడింది. టీటీడీ మార్కెటింగ్‌ గోదాముల విభాగం అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్య తలెత్తింది. శ్రీవారికి వివిధ రకాల ప్రసాదాలను నిత్యం నైవేద్యం సమయంలో నివేదిస్తారు. అనంతరం భక్తులకు ఉచితంగా పంపిణీ చేస్తుంటారు. ఇందులో బెల్లం పొంగలికి విశేష ప్రాధాన్యం ఉంది. బెల్లం నిల్వలు నిండుకోవడంతో ఆఖరుకు భక్తులు తులాభారం రూపంలో సమర్పించిన బెల్లాన్ని ప్రసాదం తయారీకి వినియోగించారు. అన్న ప్రసాదంవద్దా నిత్యం సుమారు 650 కిలోల బెల్లంతో పొంగలి తయారు చేసి భక్తులకు వడ్డిస్తుంటారు. ఇక్కడా బెల్లం కొరత కారణంగా మూడు రోజులుగా చక్కెర పొంగలి తయారు చేసి వడ్డిస్తున్నారు. స్వామివారి ప్రసాదం తయారీకి సమస్య తలెత్తిన విషయం బహిరంగం కావడంతో తితిదే అధికారులు యుద్ధప్రాతిపదికన తిరుపతి నుంచి తిరుమలకు శనివారం సాయంత్రం 2వేల కిలోల బెల్లం తీసుకొచ్చారు. తిరుపతి గోదాములో 20వేల కిలోల బెల్లం ఉన్నా నాణ్యత పరీక్షలో ఆలస్యం కారణంగా దానిని వినియోగించుకోలేని పరిస్థితి తలెత్తింది.