భద్రత.. మనందరి బాధ్యత

546

28వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా కావలి డివిజన్లోని తుమ్మలపెంట గ్రామంలో స్థానికులకు రహదారి భద్రతపై అవగాహన కల్పించారి అధికారులు. రోడ్లపై వాహనాలు నడిపేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రహదారి నియమాలు, నిబంధనలపై పలు సూచనలు చేశారు. ప్రయాణం చేసే సమయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తతతో ఉండాలని, ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించేవారు సీట్ బెల్ట్ పెట్టుకోవాలని చెప్పారు అధికారులు. అలాగే మద్యంతాగి వాహనాలు నడపకూడదని చెప్పారు. నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానా చెల్లించాల్సి రావడమే కాకుండా స్వయంగా ప్రాణాపాయాన్ని కొనితెచ్చుకున్నట్టు అవుతుందని సూచించారు. ప్రమాద రహిత ప్రయాణానికి అందరూ సహకరించాలని, భద్రత ప్రతి ఒక్కరికీ చెందిన అంశమని చెప్పారు కావలి రవాణా శాఖ అధికారి మురళీమోహన్. ఈ కార్యక్రమంలో ఆర్టీవో మురళీమోహన్ తోపాటు, సహాయ మోటారు వాహన తనిఖీ అధికారులు భాస్కర్ రావు, వీర పూర్ణ చంద్రరావు, రాఘవరావు పాల్గొన్నారు. స్థానిక నేతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గ్రామస్తులతో కలసి రహదారి భద్రత కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. రోడ్డు భద్రతపై తమకు అవగాహన కల్పించినందుకు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు.