మండలి చైర్మన్ కంటికి గాయం..

356

తెలంగాణ ఎమ్మెల్యేలు రౌడీల్లా ప్రవర్తించారు. సభా మర్యాదలు మంటగలిపారు. గవర్నర్ ప్రసంగం జరుగుతుండగానే ప్రతులను చించి పారేశారు. మైక్ ను విరిచేసి విసిరేశారు. మైక్ తగిలి మండలి చైర్మన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. దీంతో ఆయన బాధతో విలవిల్లాడారు. గవర్నర్‌ ప్రసంగం ముగిసిన తర్వాత ఆయన నేరుగా సరోజినీ కంటి ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల శాసన సభల్లో ఎప్పుడూ ఇలాంటి ఘటన జరగలేదు. తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో తొలిరోజే ఈ అనూహ్య సంఘటన చోటుచేసుకుంది.
అనంతరం స్వామిగౌడ్‌ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ సభ్యులు విసిరిన మైక్‌ నేరుగా తన కంటికి తగిలిందని తెలిపారు. బాధ కలుగుతున్నప్పటికీ ఓర్చుకుంటూ గవర్నర్‌ ప్రసంగం పూర్తయ్యేవరకు ఓర్చుకున్నానన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌ సూచన మేరకు సరోజిని కంటి ఆస్పత్రికి వెళ్లి పరీక్ష చేయించుకున్నట్లు తెలిపారు. కంటికి ఎలాంటి ప్రమాదం లేదని.. కొద్దిగా వాపు రావడంతో కాస్త జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు సూచించినట్లు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ఎవరిరకైనా తమ నిరసన తెలిపే హక్కు ఉంటుందని.. అయితే ఇలాంటి చర్యలు మాత్రం సరికాదని స్వామిగౌడ్‌ అన్నారు.