మలుపులు తిరుగుతున్న ఆత్మకూరు రెవెన్యూ వివాదం..

1235

నెల్లూరు జిల్లా రెవెన్యూ శాఖలో ఆత్మకూరు వివాదం మంటలు రేపుతోంది. జిల్లాలోని రెవెన్యూ ఉద్యోగులంతా ఏకమై ఉద్యమించాలని నిర్ణయానికి వచ్చారు. ఆర్.ఐ. జహీర్ ని ఎమ్మార్వో ఆఫీస్ లోనే తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టి చేతులు, వేళ్లు విరిచేసింది చాలక అతడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్.ఐ.పై దాడికే ఆగ్రహం వ్యక్తం చేసిన రెవెన్యూ ఉద్యోగులు బాధితుడిపైనే ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టాలన్న నిర్ణయంతో ఇప్పుడు ఏకంగా అమీ తుమీ తేలచుకోవాలని చూస్తున్నారు. ఈ విషయమై మంగళవారంనాడు కలెక్టర్ ను, ఎస్పీని కలవాలని నిర్ణయం తీసుకున్నారు. భూ ఆక్రమణల విషయంలో సిఫార్సు కోసం ఫోన్ చేసిన టీడీపీ నాయకుడు రమణారెడ్డి ఫోన్ కు తాను సమాధానం చెప్పలేదని, నేరుగా ఆఫీస్ కు వచ్చి విచక్షణా రహితంగా కొట్టాడని జహీర్ ఆరోపిస్తున్నాడు. అయితే ఈ స్థల వివాదంలో ఆర్.ఐ.జహీర్ పై కేసు కట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదుని ఎందుకు నమోదు చేయలేదని నిన్న మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోలీస్ స్టేషన్ కు వెళ్లి పోలీసులను నిలదీసిన విషయం తెలిసిందే. రామనారాయణ రెడ్డి పోలీస్ స్టేషన్ కు వచ్చిన తర్వాతనే ఆర్.ఐ.జహీర్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు కట్టారు. దీంతో రెవెన్యూ ఉద్యోగుల్లో మరింత కలకలం మొదలైంది. ఈ కేసుని దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందనే అనుమానం రెవెన్యూ ఉద్యోగుల్లో మొదలైంది. ఇదిలా ఉండగా తమ పార్టీ నాయకుల తరపున పోలీస్ స్టేషన్ కి పోయిన రామనారాయణ రెడ్డి వాదన మరో విధంగా ఉంది. పోలీసులు పక్షపాతంగా వ్యవహరించారని, తమ పార్టీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదులు నమోదు చేయకుండా రెవెన్యూ ఉద్యోగులిచ్చిన ఫిర్యాదునే తీసుకుని నిర్ణయం తీసుకోవడం మంచి పద్ధతి కాదని అన్నారు. దీన్ని ఎలా పరిష్కారం చేసుకోవాలో అలాగే చేస్తామని కూడా చెప్పారు. రామనారాయణ రెడ్డి ఈ మాటలు చెప్పిన గంటలోపే జహీర్ పై కేసు నమోదయింది. ఆర్.ఐ. కూడా నరసింహులు అనే వ్యక్తిని కులం పేరుతో దుర్భాషలాడి కిందకు తోసేశాడనేది ఆర్.ఐ.పై ఇచ్చిన ఫిర్యాదు. దీంతో ఆత్మకూరులో చెలరేగిన ఈ వివాదం జిల్లా వ్యాప్తంగా రగులుకుంది. అన్ని ఎమ్మార్వో కార్యాలయాల వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు తగిలించి నిరసన వ్యక్తం చేశారు. ఇప్పుడు రెండో విడత ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీన్ని ఎలా ఎదుర్కోవాలనే విషయంపై వ్యూహం రూపొందిస్తున్నారని తెలుస్తోంది. వివాదం ముదరకుండా సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా జరుగుతోంది.