మహిళా స్ఫూర్తికి మారుపేరు రోశమ్మ..

634

సారా వ్యతిరేక ఉద్యమానికి ఊపిరిలూదిన దూబగుంట రోశమ్మ తుదిశ్వాస విడిచారు. సారా వ్యతిరేక ఉద్యమం ద్వారా నెల్లూరు జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారామె. ఆమె అసలు పేరు వర్దినేని రోశమ్మ. నెల్లూరు జిల్లా కలిగిరి మండలం తూర్పు దూబగుంట స్వగ్రామం. సారాకు వ్యతిరేకంగా ఆమె సాగించిన ఉద్యమం అప్పటి సీఎం ఎన్టీఆర్ ను సైతం కదిలించింది. ఆమె మొదలు పెట్టిన ఉద్యమమే రాష్ట్ర వ్యాప్తంగా పెను ఉప్పెనలా మారి చివరకు రాష్ట్ర ప్రభుత్వం మద్యపానాన్ని నిషేధించేలా చేసింది. దీంతో ఊరిపేరే ఆమె ఇంటిపేరయింది. వర్దినేని రోశమ్మ.. దూబగుంట రోశమ్మగా రాష్ట్రం వ్యాప్తంగా పేరుతెచ్చుకుంది. వయసు మీద పడటంతో అనారోగ్యానికి గురైన రోశమ్మ.. కొన్నాళ్లుగా మూత్రపిండాల వ్యాధితో బాధపడుతోంది. డయాలసిస్ తప్పనిసరి అయింది. నెల్లూరు వచ్చి డయాలసిస్ చేయించుకునే స్థోమత లేకపోవడంతో ఇటీవల ఆమె వైద్యానికి దూరమైంది. ఆదివారం ఉదయం కలిగిరిలో ఆమె తుదిశ్వాస విడిచింది.