మిలియన్ డాలర్ ప్రశ్న ?

237

కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయవద్దని టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు కర్నాటకలో తెలుగు ప్రజలకు అనేక విజ్ఙప్తులు పంపారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేశారు. ప్రత్యేకహోదా ఇస్తానంటూ బీజేపీ మోసం చేసిందని బీజేపీపై కక్ష తీర్చుకునే సమయం వచ్చిందని, ఆ పార్టీని కర్నాటక ఎన్నికల్లో ఓడించండి అంటూ పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ కు ద్రోహం చేసిన పార్టీని క్షమించవద్దంటూ సందేశాలు పంపినా ఏ పార్టీకి ఓటు వేయాలన్న విషయం మాత్రం స్పష్టం చేయలేదు. దీన్నిబట్టి కర్నాటకలో తెలుగువారికి మనరాష్ట్ర నేతలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయండని స్పష్టం చేశారు. అయితే ఫలితాలు పరిశీలిస్తే తెలుగు ప్రజలు ఎక్కువగా వున్న ప్రాంతాల్లో బీజేపీ గెలిచింది. దీన్నిబట్టి కర్నాటకలోని తెలుగు ప్రజల్లో మన రాజకీయ పార్టీల వినతులు, విజ్ఞప్తులు ఏవీ పని చేయలేదని అర్ధమవుతోంది. కర్నాటకలో తూర్పు ప్రాంతాల్లో తెలుగువారు ఎక్కువగా వుంటారు. బెంగుళూరు రూరల్, బళ్లారి, కొప్పల్, చిక్ బళ్లాపూర్, కోలార్, రాయచూర్, తుంకూర్ జిల్లాల్లో మన తెలుగువారి ఓట్లే కీలకం. అయితే ఈ జిల్లాల్లో బీజేపీ అభ్యర్ధులే ఎక్కువ సంఖ్యలో గెలిచారు. దీన్నిబట్టి మన రాష్ట్రం నుంచి రాజకీయపార్టీల విజ్ఞప్తులను కర్నాటకలోని తెలుగువారు పట్టించుకోలేదని, మన ప్రత్యేక హోదా అంశం వారికి ప్రధానాంశం కాదని తేలిపోయింది. ఒకరకంగా కర్నాటకలో బీజేపీ గెలుపు తెలుగుదేశం పార్టీని నిరాశలో ముంచింది. కర్నాటకలో కన్నడిగులు, ముస్లింలు, తర్వాత తెలుగు ప్రజలదే మూడో స్థానం. మొత్తం ఓటర్లలో 15.74 శాతం తెలుగు మాట్లాడే ప్రజలే. ఈ పరిస్థితుల్లో దక్షిణ భారతదేశంలో కర్నాటకలో బీజేపీ పట్టు సంపాదించడం, అనుకున్న దానికంటే ఎక్కువగా విజయం సాధించడం గమనార్హం.