మెల్లా మెల్లగ వచ్చిండే.. క్రీమ్ బిస్కెట్ వేసిండే..

5619

సరసాల సోగ్గాడు, సైదాపురం ఎస్సై ఉదంతం పోలీసు వర్గాల్లో కలకలం రేపుతోంది. గత కొన్నేళ్లుగా నెల్లూరు పోలీస్ శాఖలో సరసాల పోలీసు కథలు లేవు. ఇప్పుడు సైదాపురం ఎస్సై ఏడుకొండలు ఊటుకూరు సర్పంచ్ తో ఫోన్లో మాట్లాడిన విధానం చూస్తే సరసాల సోగ్గాడు తను ట్రాప్ చేయాలనుకున్న ఆడవాళ్లతో ఎలా మాట్లాడతాడో ఎంత చాకచక్యంగా ముగ్గులోకి దించుతాడో అర్థమవుతోంది. ఊటుకూరు సర్పంచ్ తో ముందు ఫోన్ సంభాషణ మొదలు పెట్టే సమయంలో అమ్మా అమ్మా అంటూ ఆ తర్వాత చిలకమ్మా అనే స్థాయికి వచ్చేశాడు. దీంట్లోనే సోగ్గాడు ఏడుకొండలు ఆడవాళ్లకు లైనేసే విధానం ఎంత తమాషాగా ఉంటుందో అర్థమవుతుంది. సర్పంచ్ పద్మజ బంధువులు, భర్త కేసులకు సంబంధించి విచారణ గాలికొదిలేసి ఆమెను లైన్లోకి తీసుకొచ్చుకునేందుకు ఈ కేసుల్ని అడ్డం పెట్టుకోవడమే పోలీసు నిబంధనల్లో పెద్ద నేరం. ఆ కేసుల విచారణ పేరుతో తరచూ సర్పంచ్ ఇంటికి వెళ్లి ఆమెతో మాటలు కలపాలనుకోవడమే నీఛం. ఫోన్ సంభాషణను బట్టి ఇంట్లో భర్తలేని సమయంలో ఎస్సై సర్పంచ్ ఇంటికి పోయాడని, అప్పుడే తన మనసులో మాటను బైటపెట్టాడన్నది అర్థమవుతోంది. కిటికీలేస్తే కనపడదు అయినా నిన్ను బాధపెట్టడం ఎందుకులే అని వచ్చేైశాను అనడంలోనే ఎస్సై పద్మజపై కన్నేసే ఇంటికి పోయాడని అర్థమవుతోంది. వయసులో ఉన్నా 18 ఏళ్ల పిల్లలా ఉన్నావు, ఆ బాడీ ఎలా మెయింటెన్ చేస్తున్నావు, మీ అబ్బాయి రాత్రిపూట ఇంటికి వస్తాడా, నువ్వు ఎప్పుడైనా గూడూరుకు కానీ నెల్లూరుకు కానీ వస్తుంటావా, ఈ సారి వచ్చినపుడు నెల్లూరులో ఏసీ లాడ్జీ తీసుకుని కలుద్దాం.. ఇలా అవతలివైపు నుంచి పెద్దగా మాటల్లేకపోయినా ఎస్సై తానే చొరవ తీసుకుని మాట్లాడినట్టు అర్థమవుతోంది. రాత్రంతా నాకు నిదర పట్టలేదు, కలలో కూడా నువ్వే వస్తున్నావు, అంటూ పదహారేళ్ల వయసు ప్రేమికుల లాగా మాట్లాడటం చూస్తే ట్రాప్ చేయడంలో ఏడుకొండలు టాప్ అనిపిస్తోంది. ఈ ఎస్సై తరచూ కేసు నెపంతో సర్పంచ్ ఇంటికి పోతుండటం దాన్ని పరిష్కారం చేయకుండా తిరకాసు పెడుతూ ఆమెకు లైను వేసి ఇలా మాట్లాడుతుంటడంతో విధిలేని పరిస్థితుల్లో వాయిస్ రికార్డ్ చేసి ఎస్పీ దృష్టికి తీసుకుపోయినట్టు తెలిసింది. పద్మజతో ఫోన్ లో మాట్లాడుతుండగానే పోలీస్ తెలివిని కూడా ఏడుకొండలు ప్రదర్శించాడు. మాట్లాడాల్సిందంతా మాట్లాడేసి ఫోన్ లో వాయిస్ రికార్డింగ్ లేదుకదా అంటూ అడిగేసి అనుమానం తీర్చేసుకున్నాడు. ఏడుకొండలు విషయం తెలిసిన వెంటనే ఏమాత్రం జాప్యం చేయకుండా అతడ్ని వీఆర్ కు పిలిపించడం, సస్పెన్షన్ కు సిఫార్స్ చేయడం కూడా ప్రజల్లో ఎస్పీ పై నమ్మకాన్ని పెంచింది. మొత్తానికి ఎస్సై ఫోన్ సరసం పోలీస్ శాఖలో సంచలనం రేపింది.