రజనీయా మజాకా..

160

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘కాలా’. ఈ చిత్రం గురించి నిత్యం ఆసక్తికర వార్తలు వెలువడుతుండగా అభిమానుల్లో రోజు రోజుకు క్రేజీ పెరుగుతోంది. తాజాగా ఈ చిత్రంలో రజనీకాంత్‌ పక్కన నటిస్తున్న శునకం వార్తలకెక్కింది. దాని పేరు మణి. రజనీ ఓ కుర్చీలో కూర్చొని పక్కనే కుక్కను నిమురుతూ ఫోజులిస్తూ పోస్టర్‌ ఇటీవల విడుదలైంది. ఈ పోస్టరు ఇప్పటికే సామాజిక మాధ్యమాలలో హల్‌చల్‌ చేస్తోంది. ఇదిలా ఉండగా మణిని సొంతం చేసుకోవడానికి వివిధ దేశాలకు చెందిన రజనీ అభిమానులు పోటీ పడుతున్నారు. దీనిని కొనుగోలు చేయడానికి దాని యజమాని సిమన్‌తో చర్చిస్తున్నారు. ఓ అభిమాని ఏకంగా రూ.2 కోట్లకు బేరమాడినట్లు సమాచారం. కాని ఆయన మణిని వదులుకోడానికి ఏ మాత్రం సిద్ధంగా లేనంటూ తేల్చి చెప్పాడట. రజనీతో నటించడం ప్రారంభించిన తర్వాత మణికి వరుసగా అనేక చిత్రాల్లో నటించే అవకాశాలు వచ్చినట్లు ప్రచారం సాగుతోంది. ఈ సందర్భంగా సిమన్‌ మాట్లాడుతూ తనకు మణి రోడ్డుపై దొరికిందని, ఆదుకొనే వారు లేక చలికి ఒణుకుతుండగా చేరదీసి నటనపై శిక్షణ ఇచ్చానన్నారు. సొంత బిడ్డలా పెంచుకున్నానని, దానిని అమ్మాలనే ఉద్దేశం లేదని తేల్చి చెప్పారు. కాలా సినిమా తర్వాత మణికి క్రేజీ పెరగడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.