లేవనంటే పైకి పోతావ్..

463

రోజూ గంటలపాటు కూర్చుని పనిచేస్తారా? ఏళ్లతరబడి అలాగే పనిచే సేస్తున్నారా? అయితే.. ఇది మీ కోసమే.. ఎందుకంటే.. అలా కూర్చుని, కూర్చునే మనం మన జీవితకాలాన్ని కరిగించేసుకుంటున్నామట.. ఈ విషయాన్ని అంతర్జాతీయంగా జరిగిన అనేక అధ్యయనాలు, సర్వేలు చెబుతున్నాయి.

రోజుకు 3 గంటలపాటు అలాగే కదలకుండా కూర్చునేవారితో పోలిస్తే.. 6 గంటలు అంతకన్నా ఎక్కువ సమయం కూర్చుని పనిచేసేవారు వచ్చే 15 ఏళ్లలో చనిపోయే అవకాశాలు 40 శాతం ఎక్కువవుతాయట.

రోజూ రెండు గంటలు అంతకంటే ఎక్కువసేపు అలాగే కూర్చుని ఉండటం వల్ల శరీరంలో మంచి కొలస్ట్రాల్ 20 శాతం మేర తగ్గిపోతుంది.

ఏళ్ల తరబడి గంటలపాటు కూర్చుని పనిచేయడం వల్ల శరీరంపై పడిన ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే రోజుకు గంట పాటు వ్యాయామం చేసినా సరిపోదట.

కేవలం ఒక్కరోజు అదేపనిగా గంటలతరబడి కూర్చుంటే చాలు.. అది ఇన్సులిన్ పనిచేసే తీరుపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల మధుమేహం బారినపడే అవకాశాలు పెరుగుతాయి.

ఎక్కువసేపు నిశ్చలంగా కూర్చోవడం వల్ల కేలరీలను ఖర్చు చేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అంతేకాదు.. తక్కువ స్థాయిలో తాజా రక్తం, ఆక్సిజన్ రావడం వల్ల మెదడు పనితీరు కూడా మందగిస్తుంది.

వారంలో 23 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు కూర్చుని పనిచేసేవారిలో హృదయ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువట. ఆఫీసులో గంటలకొద్దీ సమయం కూర్చున్నదానికి తోడు ఇంటికొచ్చాక కూడా టీవీలు లేదా కంప్యూటర్ల ముందు గంటలతరబడి సిటింగ్ వేయడం ఈ ప్రమాదాన్ని మరింత పెంచుతోందట.

అందుకే లేవాలి.. లేచి.. కదలాలి.. గంటలతరబడి సీటులో సిటింగ్ వేయకుండా.. అవకాశం ఉన్నప్పుడల్లా మధ్యమధ్యలో లేవడం.. అటూ ఇటూ తిరగడం వంటివి చేయాలని పరిశోధకులు చెబుతున్నారు. దీనికితోడు రోజూ ఉదయం వాకింగ్, జాగింగ్ వంటి వ్యాయామాలు చేయాలని వారు సూచిస్తున్నారు.