వివాదంగా మారిన మధ్యప్రదేశ్ ప్రభుత్వ నిర్ణయం..

314

ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు పలికేసమయంలో పిల్లలంతా జైహింద్ అనాల్సిందేనంటూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. యస్ సర్, యస్ మేడమ్ అనడానికి బదులు పిల్లలంతా జైహింద్ అనాలని ఆదేశాలిచ్చింది. విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర విద్యా శాఖ బోర్డు వెల్లడించింది. రాష్ట్రంలోని 1.22 లక్షల ప్రభుత్వ పాఠశాలల్లో ‘జై హింద్‌’ అని చెప్పడం తప్పనిసరి అని విద్యా శాఖ మంత్రి విజయ్‌ షా వెల్లడించారు. అయితే ప్రైవేటు స్కూళ్లకు మాత్రం ఇది ఆప్షనల్‌ అని చెప్పారు. ప్రైవేటు స్కూళ్లలో కూడా హాజరు పిలిచినప్పుడు ‘జైహింద్‌’ అని చెప్పించాలని సూచిస్తూ లేఖ పంపించామని వెల్లడించారు.
దీన్ని ప్రయోగాత్మకంగా మొదట గత ఏడాది అక్టోబరులో సత్నా జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో అమలు చేశారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ నేత కేకే మిశ్ర విమర్శలు చేశారు. దేశభక్తిని బలవంతంగా రుద్దలేమని అన్నారు. జైహింద్‌ అని చెప్పడం తప్పనిసరి చేయాల్సిన అవసరం లేదని, మొదట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యత పెంచే అంశంపై దృష్టి పెట్టాలని, పాఠశాలల్లో తగినంత మంది ఉపాధ్యాయులు ఉండట్లేదని ఈ విషయాలు పట్టించుకోవాలని దుయ్యబట్టారు. గతంలో మధ్యప్రదేశ్‌లోని భాజపా ప్రభుత్వం రాష్ట్రంలోని పాఠశాలల్లో రోజూ త్రివర్ణ పతాకం ఎగురవేసి జాతీయ గీతం ఆలపించాలని సూచించింది.