వెన్నుపోటు ఎమ్మెల్యేలపై ప్రత్యేక దృష్టి..

6525

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లా పాదయాత్రలో గూడూరును టార్గెట్ చేసినట్టున్నారు. సాధారణంగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో పట్టణాలను, నియోజకవర్గ కేంద్రాలను మినహాయిస్తూ పల్లెల గుండానే యాత్ర సాగుతోంది. అయితే కడప, చిత్తూరు జిల్లాల్లో పాదయాత్రలో పార్టీ గుర్తుపై గెలిచి పార్టీకి వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేల నియోజకవర్గ కేంద్రాలను వదలకుండా పాదయాత్ర చేస్తున్నారు. నెల్లూరు జిల్లాలో కూడా ఇప్పటి వరకూ ఖరారైన జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర షెడ్యూల్ ని పరిశీలిస్తే నియోజకవర్గ కేంద్రాల్లో గూడూరుని ఒక్కదాన్నే చేర్చారు. దీంతో పార్టీకి ద్రోహం చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన ఎమ్మెల్యేలను ప్రత్యేకంగా పాదయాత్రలో టార్గెట్ చేసే వ్యూహం ఇక్కడ కూడా అనుసరించబోతున్నారని అర్థం అవుతోంది. జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో 7 నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్ధులు గెలవగా.. ఒక్క గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ మాత్రమే పార్టీ ఫిరాయించి, తెలుగుదేశంలో చేరారు. నెల్లూరు జిల్లా పాదయాత్ర షెడ్యూల్ లో పట్టణ ప్రాంతంలో పాదయాత్ర జాబితాలో ఉన్నది గూడూరు ఒక్కటే. మిగిలినవన్నీ పల్లెలే. గూడూరు కలిసే విధంగా పాదయాత్ర రూట్ మ్యాప్ ను తయారు చేశారని తెలుస్తోంది.