వైద్యం వికటించి నడిరోడ్డుపై యువకుడు దుర్మరణం..

841

ఉదయగిరి, జనవరి-29: ముప్పయ్యేళ్ల యువకుడు గుండెనొప్పితో నడిరోడ్డుపై కుప్పకూలి చనిపోయిన ఘటన ఉదయగిరి లో జరిగింది. చెర్లోపల్లి గ్రామానికి చెందిన తిరుపతయ్య అనే వ్యక్తి బెంగళూరులో బేల్డారి పనులు చేస్తుండేవాడు. భార్య రాధ ప్రసవ సమయం దగ్గర పడటంతో ఇటీవలే సొంత ఊరికి వచ్చాడు తిరుపతయ్య. మూడురోజుల క్రితం ఈ దంపతులకు మగబిడ్డ జన్మించాడు. అయితే ఆ ఆనందం అంతలోనే ఆవిరైంది. గుండెనొప్పిగా ఉందని చికిత్సకోసం చెర్లోపల్లి నుంచి ఉదయగిరి వచ్చిన తిరుపతయ్య స్థానిక దుర్గా క్లినిక్ లో వైద్యం చేయించుకున్నాడు. ఇంజక్షన్ చేసి వైద్యపరీక్షలకోసం మరో ఆస్పత్రికి వెళ్లమని తిరుపతయ్యకు సూచించాడు డాక్టర్ దుర్గయ్య. బైటకు వచ్చిన తిరుపతయ్య నాలుగు అడుగులు వేసి అక్కడే కుప్పకూలాడు. వైద్యం అందించేలోగా ప్రాణాలు వదిలాడు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తిరుపతయ్య చనిపోయాడని ఆందోళనకు దిగారు బంధువులు. అర్హత లేకుండానే దుర్గా క్లినిక్ నిర్వహిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్థానికులక ఫిర్యాదుతో దుర్గా క్లినిక్ లో వైద్యశాఖ అధికారులు తనిఖీ చేశారు. అనుమతులు లేకపోవడంతో ఆస్పత్రిని సీజ్ చేశారు.