షార్ సిగలో మరో విజయం..

909

శ్రీహరికోట, సెప్టెంబర్-8: చివరి నిమిషంలో ఉత్కంఠ రేకెత్తించిన జీఎస్ఎల్వీ ఎఫ్-05 ప్రయోగం ఎట్టకేలకు విజయవంతమైంది. సాంకేతిక కారణాలతో 40నిమిషాల ఆలస్యంగా ప్రారంభమైన ఈ ప్రయోగాన్ని షార్ శాస్త్రవేత్తలు విజయవంతం చేయగలిగారు. వాతావరణ అధ్యయనానికి సంబంధించిన ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహాన్ని నింగిలోకి మోసుకెళ్లిన వాహకనౌక 17 నిమిషాల్లోనే భూస్థిర కక్ష్యలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. రూ.250కోట్ల వ్యయంతో రూపొందించిన ఈ ఉపగ్రహం బరువు 2,211కిలోలు కాగా.. ఇంధనం 1,255 కిలోలు. ఈ ప్రయోగం కౌంట్‌డౌన్‌ బుధవారం ఉదయం 11.10 గంటలకు ప్రారంభమై… గురువారం సాయంత్రం 4.10 గంటలకు ముగిసింది. అయితే చివరి నిమిషంలో క్రయోజనిక్‌ ఇంజిన్‌లో నీటి లీకేజీని గుర్తించిన శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని వాయిదా వేసి మరమ్మతులు చేపట్టారు. అనంతరం 40 నిమిషాల ఆలస్యంగా 4.50 గంటలకు రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది.
ఇన్సాట్‌-3డీఆర్‌ ఉపగ్రహం వాతావరణ శాస్త్ర అధ్యయనంతో పాటు మరింత కచ్చితత్వంతో పరిశోధన చేస్తుంది. సముద్ర గాలి దిశలను గమనించి వాతావరణ పరిశోధనలకు చేయూత అందిస్తుంది. ఇది పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఆధునిక ఉపగ్రహం. ఇన్సాట్‌-3డీఆర్‌లో మెరుగైన ఇమేజింగ్‌ వ్యవస్థ, వాతావరణంలోని శబ్ద తరంగాలను అన్వేషించే వ్యవస్థ ఉంది. తద్వారా వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి విపత్తుల సమయంలో అప్రమత్తం చేసే వీలుంటుంది. దీని జీవిత కాలం పదేళ్లు.