స్నేహితులే హంతకులు..

2476

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షకు వెళ్తూ ఓ విద్యార్థి దారుణ హత్యకు గురయ్యాడు. వెంటాడి, వేటాడి మరీ వేటకొడవళ్లతో నడిరోడ్డులో నరికేశారు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని కూకట్‌పల్లిలో జరిగింది. కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని మూసాపేట జనతానగర్లో నివసించే రాజు పాల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. అతడికి నలుగురు సంతానం. వారిలో చిన్నవాడైన సుధీర్ కూకట్‌పల్లిలోని ప్రగతి జూనియర్ కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈరోజు ఉదయం పరీక్ష రాసేందుకు సహ విద్యార్థులు మేఘనాథ్, సాయిలతో కలిసి సుధీర్‌ బైక్‌పై బయలుదేరాడు. వారు కూకట్‌పల్లి జేఎస్‌పీ హోండా షోరూం వద్దకు చేరుకోగానే అప్పటికే కాపుకాసిన నలుగురు దుండగులు సుధీర్‌ను అడ్డగించి వేటకొడవళ్ళతో దాడి చేశారు. తప్పించుకుని పారిపోతుండగా వెంటాడి నరికి చంపేశారు. వారిని అడ్డగించేందుకు ప్రయత్నించిన సాయి, మేఘనాథ్‌పై దాడికి ప్రయత్నించటంతో వారు అక్కడి నుండి పారిపోయారు.
హత్య చేసిన అనంతరం అక్కడి నుండి పారిపోతున్న నలుగురిని అక్కడే ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న హోంగార్డ్ పరమేష్ వెంటపడి ఒకరిని పట్టుకున్నాడు. అప్పటికే స్థానికులు పోలీసులకు సమాచారం అందించటంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. మూసాపేటలో నివసించే కృష్ణ, మహేష్, తేజ, నవీన్‌ ఈ హత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో మహేష్ ను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు. ఏసీబీ కార్యాలయం, ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలోనే ఈ ఘటన జరగడం నగరవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.