మాదాల రంగారావు క‌న్నుమూత‌

1185

విప్లవ చిత్రాల హీరో, సినీ నిర్మాత, ద‌ర్శ‌కుడు మాదాల రంగారావు కన్నుమూశారు. ఆయన వయసు 69 సంవత్సరాలు. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని స్టార్ హాస్పిటల్ లో శ్వాసకోశ సంబంధ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న ఆయ‌న ఈ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఆయ‌న కుమారుడు మాదాల ర‌వి కూడా సినీ ప‌రిశ్ర‌మ‌లో కొన‌సాగుతున్నారు. మాదాల మృతిపై టాలీవుడ్ పెద్దలు, ప‌లువురు రాజ‌కీయ ప్ర‌ముఖులు సంతాపాన్ని తెలియజేశారు. మాదాల రంగారావు మృతితో ఆయన స్వగ్రామమైన ప్రకాశం జిల్లా మైనంపాడులో విషాధ ఛాయలు అలముకున్నాయి.

1980-90 దశకంలో సామాజిక విప్లవ సినిమాలతో తెరపై సంచలనం సృష్టించారు మాదాల రంగారావు. వామపక్ష భావజాలం కలిగిన ఆయ‌న విప్లవ భావాలతో కూడిన చిత్రాల్లో నటించి, సమాజంలో వేళ్లూనుకున్న అవినీతి, అక్ర‌మాల‌ను తన సినిమాల్లో క‌ళ్ళ‌కు క‌ట్టి చూపించారు. ‘చైర్మన్ చలమయ్య’ చిత్రంతో సినీరంగ ప్రవేశం చేసిన మాదాల రంగారావు, ఆ తరువాత నవతరం ప్రొడక్షన్స్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి, తొలిసారిగా ‘యువతరం కదిలింది’ చిత్రాన్ని తీసి, బంగారు నంది పురస్కారాన్ని అందుకున్నారు. ఎర్రమల్లెలు, ఎర్ర పావురాలు, మరో కురుక్షేత్రం, మహా ప్రస్థానం, నవోదయం, విప్లవశంఖం, బలిపీఠంపై భారతనారి, ఎర్ర సూర్యుడు, ఎర్ర పావురాలు, ప్రజాశక్తి, స్వరాజ్యం తదితర చిత్రాల‌తో సినీ ప్రియుల మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర‌వేశారు.