50ఏళ్లుగా వస్తున్న ఆచారం..

1292

ఉభయ దేవేరులతో శ్రీవారి కల్యాణోత్సవాలను మనం అన్నిచోట్లా చూస్తుంటాం. కానీ ఈ కల్యాణం మాత్రం ప్రత్యేకం. దేవదేవుడు సాధారణ బాలికను వివాహం చేసుకునే వింత ఆచారం ఇది. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలోని కోటలో వెలసిన ప్రసన్న వెంకటరమణస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీవారి కల్యాణోత్సవం కనుల పండువగా నిర్వహించారు. దాదాపు 50 ఏళ్లుగా వస్తున్న సంప్రదాయంలో భాగంగా స్వామికి ఎనిమిదేళ్ల బాలికతో వివాహం జరిపించారు. ఇలా చేయడం వల్ల ఆ బాలికకు సుగుణ సంపన్నుడైన భర్త లభిస్తాడనేది భక్తుల నమ్మకం. ఏటా పద్మశాలి వంశం అరవ తెగకు చెందిన బాలికతో శ్రీవారికి పెళ్లి చేసే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతోంది.
ఈ ఏడాది రాయదుర్గానికి చెందిన అరవా ప్రకాష్, యశోద దంపతుల కుమార్తె రేఖతో శ్రీవారి వివాహం జరిపించారు. పెళ్లి పెద్దలుగా శ్రీవారి తరపున పూజారులు, ఆలయ పాలక కమిటీ సభ్యులు, పుర ప్రముఖులు ఉదయం మేళతాళాలతో పెళ్లి కూతురు పద్మావతిని (రేఖ) ఊరేగింపుగా మార్కండేయస్వామి ఆలయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి పెళ్లికూతురిని అలంకరించి కోటలోని శ్రీవారి సన్నిధి వరకు ఊరేగింపుగా వచ్చారు. అనంతరం సంప్రదాయబద్ధంగా మంత్రోచ్ఛారణల మధ్య పురోహితులు, వేదపండితుల ఆధ్వర్యంలో వివాహ కార్యక్రమాన్ని నిర్వహించారు.