డిసెంబర్ 31 రాత్రి తాగుడు ఖర్చు 70కోట్లు..

144

కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ మత్తులో ఊగిపోయింది. గ్రేటర్‌ పరిధిలో మందుబాబులు ఖజానాకు ‘ఫుల్లు’ కిక్కు ఇచ్చారు. డిసెంబరు 31వ తేదీ ఒక్కరోజే సుమారు రూ.70 కోట్లు విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. 2017 డిసెంబరు 31న అమ్మకాలు రూ.60 కోట్లు మాత్రమే. విపరీతంగా ఉన్న చలిని సైతం లెక్క చేయకుండా.. నూతన సంవత్సర వేడుకల్లో నగరవాసులు పాల్గొన్నారు. అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే మద్యం సరఫరాకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో రాత్రి 12.30 గంటల సమయంలోనూ నగరంలోని కొన్ని బార్లు కిటకిటలాడాయి. మందుబాబులు బార్లు, మద్యం దుకాణాల సమీపంలో రహదారులపై తూలుతూ కనిపిచ్చారు. ముఖ్యంగా ఆబిడ్స్‌లోని ప్రధాన తపాలాశాఖ కార్యాలయం ఎదురుగా ఉన్న రహదారిపై సోమవారం రాత్రి 12.30గంటల సమయంలో మందుబాబుల వాగ్వాదంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దిల్‌సుఖ్‌నగర్‌లోని కోణార్క్‌ థియేటర్‌ సమీపంలోనూ పలువురు మద్యం తాగి హల్‌చల్‌ చేయడంతో ఇదే పరిస్థితి ఎదురైంది. పోలీసులంతా రహదారులపై వాహనాల తనిఖీలకే ప్రాధాన్యం ఇచ్చారని, మద్యం దుకాణాల వద్ద పరిస్థితిని పట్టించుకోలేదన్న విమర్శలు వచ్చాయి.