సివిల్ ఇంజినీర్ ప్రియాంక చౌదరి దుర్మరణం..

3738

కావలి, సెప్టెంబర్-30: కావలికి చెందిన గోగినేని ప్రియాంక చౌదరి (25) అమెరికాలో దుర్మరణం పాలైంది. ఉన్నత చదువులకోసం 2014లో అమెరికా వెళ్లిన ఆమె ఇటీవలే చదువు పూర్తి చేసుకుని లాస్ వెగాస్ లోని ఓ సంస్థలో సివిల్ ఇంజినీర్ గా ఉద్యోగంలో చేరింది. రోజులాగే వాకింగ్ కి వెళ్లిన ఆమె, హిక్ లేట్ అనే కొలను దగ్గర కాళ్లు కడుక్కునేందుకు లోపలికి దిగి పొరపాటున జారిపడి ప్రాణాలు కోల్పోయింది. ప్రియాంక మరణవార్తతో కావలిలోని చేవూరివారితోటలో ఆమె ఇంటి దగ్గర విషాద ఛాయలు అలముకున్నాయి. ఒక్కగానొక్క కూతురు ప్రమాదంలో చనిపోయిందని ఆమె తండ్రి గోగినేని వెంకటేశ్వర్లు కన్నీరు మున్నీరయ్యారు. మృతదేహం సోమవారం కావలికి చేరుకుంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రియాంక మృతిపై కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.