తల్లిశవంపై కూర్చుని అఘోరా పూజలు..

3794

తమిళనాడులోని తిరుచ్చి సమీపంలో తల్లి మృత దేహంపై కూర్చొని ఓ అఘోర పూజ చేయడం కలకలం సృష్టించింది. దేవుడి కోసం తమ జీవితాన్ని అర్పించామని చెప్పుకొంటూ హిమాలయాల్లో కనిపించే అఘోరాలు.. శ్మశానాల్లో జీవించడం కర్తవ్యంగా భావిస్తారు. ప్రస్తుతం తమిళనాడులోని అనేక ప్రాంతాల్లో తమ ఇష్ట దేవతలకు ఆలయాలు నిర్మించి వీరు పూజలు చేస్తున్నారు. అందులో భాగంగా తిరుచ్చి జిల్లా తిరువెరుంబూరు సమీప అరియమంగలంలో జయ్‌ అఘోర కాళీ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని కాశీలో అఘోర శిక్షణ పొందిన మణికంఠన్‌ నిర్వహిస్తున్నాడు. ఇక్కడ ప్రతి వారం ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఈ ఏడాది వార్షికోత్సవం ఈ నెల 10న ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మణికంఠన్‌ తల్లి మేరీ మృతిచెందింది. ఆమె అంత్యక్రియలు అరియమంగలం శ్మశానవాటికలో జరిగాయి. ముందుగా మేరీ మృతదేహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఇందులో అఘోరాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఊరేగింపు శ్మశానంలోకి వెళ్లిన తర్వాత మణికంఠన్‌.. మృతదేహాంపై కూర్చుని మంత్రాలు చదువుతూ పూజ మొదలు పెట్టగా సహ అఘోరాలు ఇందులో పాల్గొన్నారు.