వామ్మో నాలుక బైటకు వచ్చేసింది..

103

ఈ చిత్రంలోని బాలుడిని చూశారా? ఒకటి, రెండు కాదు ఏకంగా పన్నెండేళ్లుగా ఈ చిన్నారి సరైన భోజనం చేయలేక ఇబ్బంది పడుతున్నాడు. నాలుక నానాటికీ అసాధారణంగా పెరుగుతూ ఉండటంతో ఘనాహారాన్ని భుజించలేక, కేవలం ద్రవ పదార్థాన్నే తీసుకుంటున్నాడు. వికారాబాద్‌ జిల్లా బషీరాబాద్‌ మండలం క్యాద్గిరకు చెందిన మోహన్‌(12)కు పసితనం నుంచే నాలుక పెరగడం మొదలయింది. నోట్లోంచి బయటికి వచ్చిన నాలుక పరిమాణం ఇంకా పెరుగుతూనే ఉంది. ఖరీదైన వైద్యం చేయించాలని సూచించడంతో.. అంత స్థోమత లేక తల్లిదండ్రులు కమలమ్మ, చంద్రశేఖర్‌ మిన్నకుండిపోయారు. కొందరు గ్రామస్థులు 1098 చైల్డ్‌లైన్‌కు సమాచారం అందించారు. స్పందించిన చైల్డ్‌లైన్‌ ప్రతినిధి హన్మంతరెడ్డి శుక్రవారం గ్రామానికి చేరుకొని, బాలుడిని తహసీల్దార్‌ ఉమామహేశ్వరి వద్దకు తీసుకొచ్చారు. బాలుడి పరిస్థితిని చూసిన ఆమె.. ఉన్నతాధికారులకు వివరించి వైద్యంచేసేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.