లారీ ఢీకొన్న కారు.. నలుగురు దుర్మరణం..

43

ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతినగర్‌ వద్ద శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీని కారు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ జిల్లా కసింకోట మండలం ఎలమంచిలి గ్రామానికి చెందిన ఎం.వెంకటరామకృష్ణ పరమహంస(60), అతడి భార్య సూర్యకాంతం(55), మరో బంధువు చంద్రమౌళి(55)తో పాటు డ్రైవర్‌ సంతోష్‌(40) గురువారం రాత్రి 11 గంటలకు కారులో విశాఖ నుంచి తిరుపతి బయల్దేరారు. శుక్రవారం ఉదయం 10:30గంటలకు శాంతినగర్‌ వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురూ అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న కందుకూరు సీఐ ఖాజావలి సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు.