నెల్లూరు జిల్లాపై బాబు గురి..

114

చంద్రబాబు నాయుడు నెల్లూరు జిల్లామీద గురి పెట్టారు. గత ఎన్నికల్లో జిల్లాలో మొత్తం పదింటిలో 7 సీట్లు వైసీపీ గెలుచుకోవడంతో దీన్ని వైసీపీకి బలమైన స్థావరంగా తెలుగుదేశం పార్టీ పరిగణిస్తోంది. గత ఎన్నికల కంటే ఇప్పుడు వైసీపీ జిల్లాలో బలంగా ఉందనుకుంటున్న నేపథ్యంలో చంద్రబాబు నాయుడు జిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టారు. ఇటీవలే వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేట మూడు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం చేసి వెళ్లారు. ఇప్పుడు మళ్లీ మంగళవారం ఉదయం జిల్లా పర్యటనకు రానున్నారు. ముత్తుకూరులో రోడ్ షో, బహిరంగ సభ తర్వాత నెల్లూరు వేదాయపాలెం సెంటర్ నుంచి నర్తకి సెంటర్ వరకు రూరల్, సిటీ నియోజకవర్గాలు కలసి వచ్చేట్టు రోడ్ షో, బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రాత్రికి ఇక్కడే బసచేసి, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాల్లో పర్యటిస్తారు. ఈ దఫా జిల్లాలో టీడీపీ తరపున ఎంపీ అభ్యర్థి విషయంలో మొదట కొంచెం సందిగ్ధత వచ్చినా ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీనుంచి వెళ్లిపోయినా, ఎంపీ అభ్యర్థిగా బీదా మస్తాన్ రావుని పెట్టి గట్టి పోటీ ఇవ్వగలుగుతున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో హోరాహోరీగా పోరు జరుగుతున్నా ఎంపీ అభ్యర్థి విషయంలో మాత్రం తామే ముందంజలో ఉంటామని తెలుగుదేశం పార్టీ ధీమాగా ఉంది. తమ అభ్యర్థి బీదా మస్తాన్ రావుకి అనుకూలంగా జిల్లా వ్యాప్తంగా క్రాస్ ఓటింగ్ జరుగుతుందన్న ఆశతో ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం హోరాహోరీ పోరు జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు జిల్లాపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ దఫా జిల్లాలో అత్యథిక సీట్లు కైవసం చేసుకోవాలన్న ఏకైక లక్ష్యంతో ఉన్నారు. అందుకే 2 రోజులు జిల్లాలో మకాం వేసి రోడ్ షోలు, సభలకు సన్నద్ధమయ్యారు.