కోవూరులో ఎర్రంరెడ్డి తిరుగుబాటు..

132

కోవూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో పెద్ద తిరుగుబాటు. పార్టీలో సీనియర్ నాయకుడు, పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలోనే ఉంటున్న ఎర్రంరెడ్డి గోవర్ధన్ రెడ్డి, నియోజకవర్గ తెలుగుదేశం టికెట్ తనకే ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన అభిమానులు, అనుచరులతో సమావేశం ఏర్పాటు చేసి, తనకు తెలుగుదేశం పార్టీ టికెట్ వచ్చేందుకు శాసన సభ్యుడు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, టికెట్ ఆశిస్తున్న పెళ్లకూరు శ్రీనివాసులరెడ్డి, చేజర్ల వెంకటేశ్వర రెడ్డి సహకరించాలని కోరారు. సుదీర్ఘకాలంగా నియోజకవర్గంలో ఎన్నికల రాజకీయాలను తానే ప్రత్యక్షంగా చూశానని, అందరికీ పనిచేశానని, ఈ దఫా తనకు అవకాశం ఇవ్వాలని, ఇందుకు పార్టీ పెద్దలు కూడా సహకరించాలని కోరారు. కొన్ని మండలాల్లో పార్టీ పరిస్థితి బాగాలేదని, సమన్వయం చేసుకునే పరిస్థితి కూడా లేదని, అందువల్ల తనకు అవకాశం ఇస్తే పార్టీని గెలిపించుకుంటానని అన్నారు. నిన్న మొన్నటి వరకు పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి వైపే ఉన్న ఎర్రంరెడ్డి గోవర్దన్ రెడ్డి ఆకస్మికంగా తనకే టికెట్ కావాలని తిరుగుబాటు జెండా ఎత్తుకోవడంతో ఇప్పుడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నిజంగానే డోలాయమానంలో పడిపోయింది. నియోజకవర్గంలో ముఖ్యంగా బుచ్చిరెడ్డిపాలెం మండలం కీలకమైనది. ఈ మండలంలో గోవర్దన్ రెడ్డికి చెప్పుకోతగ్గ స్థాయిలో అనుచరులు, అభిమానులు ఉన్నారు. పార్టీలో సుదీర్ఘ కాలంగా ఉండటంతో మండలంలో పార్టీ ఆయన వెన్నంటే ఉంది. దీంతో ఎర్రంరెడ్డి గోవర్దన్ రెడ్డి తిరుగుబాటు పార్టీలో కూడా కలకలం రేపుతోంది. నియోజకవర్గ క్రియాశీలక రాజకీయాల్లో అతి ముఖ్యుడైన గోవర్దన్ రెడ్డి ఆకస్మికంగా టికెట్ తనకే కావాలని కోరడంతో పోలంరెడ్డి కూడా ఇరకాటంలో పడినట్టే.