కలెక్టరేట్ లో అగ్ని ప్రమాదం..

186

చిత్తూరు జిల్లా కలెక్టరేట్ లో అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కరెంట్ షార్ట్ సర్క్యూట్ ఈ ప్రమాదానికి కారణం అని తేలింది. ఈ అంతస్తులో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లు చేశారు. భారీ ఎల్‌ఈడీ తెర సహా 112ల్యాప్‌టాప్‌లు అందుబాటులో ఉంచారు. ఈరోజు పోలింగ్‌ను ఇక్కడినుంచే పర్యవేక్షించి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చేవీలుగా దీన్ని ఏర్పాటుచేశారు. ఇదే గదిలో పది వరకు ఏసీలు, 30పైనే ఫ్యాన్లు, ఇతర సామగ్రి అందుబాటులో ఉంచారు. షార్ట్ సర్క్యూట్ తో అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. ఈ భవనాన్ని గతేడాది రూ.20లక్షలతో ఆధునికీకరించారు. ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి పీఎస్‌ ప్రద్యుమ్న హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. వెంటనే అగ్నిమాపక యంత్రాలు రంగంలోకి దిగి మంటలు అదుపుచేస్తున్నాయి. ఏసీ నుంచి షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి విద్యుత్తు తీగలకు అంటుకోవడం, వాటికి ఛార్జింగ్‌ నిమిత్తం ల్యాప్‌టాప్‌లు అనుసంధానించి ఉండటంతో క్రమేపీ మంటలు వాటికీ వ్యాపించాయి.