మృత్యుంజయురాలు..

250

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో ఏడాది వయసున్న ఓ పాప రైల్వే ప్లాట్ ఫారం నుంచి రైల్వే ట్రాక్‌పై పడిపోయింది. అదే సమయంలో ఒక రైలు వెళ్లడంతో పాప పరిస్థితిపై అందరూ ఆందోళన చెందారు. అయితే ఆశ్చర్యకరంగా అదృష్టవశాత్తూ పాపకి ఎటువంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఫ్లాట్ ఫారం పై నుంచి ఆ పాప ఒక్కసారిగా పట్టాలపై పడిపోయింది. అయితే ప్లాట్‌ఫారానికి పట్టాలకు మధ్యలోనే ఉండిపోయింది. అంతలోనే ఓ రైలు వెళ్లింది. దీంతో ఆ స్టేషన్‌లో ఈ దృశ్యాన్ని చూసిన వారంతా కంగారు పడ్డారు. ఆ రైలు వెళ్లగానే రైల్వే ట్రాకుపైకి దిగిన ఇతర ప్రయాణికులు ఆ పాపను తిరిగి ఫ్లాట్‌ ఫారమ్‌ మీదకు తీసుకొచ్చారు. ఆమెకు గాయాలు కాలేదని తెలిపారు.
ఈ ఘటన మథుర రైల్వే స్టేషన్‌లోని ఫ్లాట్‌ ఫారమ్‌ నంబరు 1 వద్ద ఈ రోజు ఉదయం చోటు చేసుకున్నట్లు సమాచారం. ఆ పాప తల్లిదండ్రులు ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఆ పాప చేతిని పట్టుకుని ఆమె తల్లి నిలబడి ఉంది. అయితే, ఒక్క సారిగా ఆమెను ఎవరో కదిలించగా ఆమె తన పాపకు తగిలింది. దీంతో ఆ చిన్నారి రైల్వే ట్రాక్‌పై పడిపోయినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను ఓ ప్రయాణికుడు తన స్మార్ట్‌ఫోన్‌లో రికార్డు చేశాడు.