గ‌డ్డంలో గ్లామ‌ర్ సీక్రెట్‌

806

సాధార‌ణంగా సూర్య‌ర‌శ్మి ఎక్కువ‌గా ముఖం మీద ప‌డితే ఆ చ‌ర్మం నిగారింపు కోల్పోతుంద‌న్న విష‌యం తెలిసిందే. అందుకే ర‌క‌ర‌కాల కాస్మోటిక్స్‌కి జ‌నాలు అల‌వాటు ప‌డిపోతున్నారు. ఆడ‌వాళ్ళ సంగ‌తి ప‌క్క‌న పెడితే కాస్మోటిక్స్ అవ‌స‌రం లేకుండానే మ‌గ‌వాళ్ళు చ‌ర్మ సౌంద‌ర్యాన్నికాపాడుకోవ‌చ్చు. అది కూడా గ‌డ్డం ద్వారా అంటే న‌మ్మ‌గ‌ల‌రా. ఎవ‌రు న‌మ్మినా, న‌మ్మ‌క‌పోయినా ఇది మాత్రం ప‌చ్చి నిజం.

ఓ వ్య‌క్తి గ‌డ్డం పెంచుకుని ఉంటే ఆ వ్య‌క్తి బాధ‌తోనో, రోగంతోనో ఉన్నాడ‌ని అభిప్రాయ‌ప‌డుతుంటారు. ఒక‌ప్పుడు గ‌డ్డం బాగా పెంచుకుని ఎవ‌రైనా తిరిగితే… వీడికేదో అయ్యింది అని అపోహ‌లో ఉండేవారు. గ‌డ్డం తీసేయ‌మంటూ ఇంట్లో పెద్ద‌వాళ్ళు ఒత్తిడి తెచ్చేవారు. కానీ కాలం మారుతూ వ‌స్తోంది. నేటి యువ‌త మాత్రం చాలావ‌ర‌కు గ‌డ్డంతోనే తిరుగుతున్నారు. గ‌డ్డం మ‌రీ ఎక్కువ‌గా ఉంటే ట్రిమ్ చేసుకుంటున్నారు. అయితే గ‌డ్డం ఉండ‌డం వ‌ల్ల‌ చాలా ప్ర‌యోజ‌నాలున్నాయ‌ట‌.

గ‌డ్డం ఎక్కువ‌గా గీసుకుంటే చ‌ర్మం సున్నిత‌త్వం దెబ్బ‌తింటుంది. అక్క‌డంతా మొద్దు బారిపోతుంది. త‌ద్వారా ఇన్ఫెక్ష‌న్‌కు గుర‌య్యే ప్ర‌మాద‌ముంది. అందుకే గ‌డ్డం ఎక్కువ‌గా తీయ‌కూడ‌దు. అంతేకాదు గ‌డ్డం స‌హ‌జ సిద్ధ‌మైన మాయిశ్చ‌రైజ‌ర్‌లా ప‌ని చేస్తుంది. తేమ‌ను శ‌రీరంలో ఉండేలా చేసి చ‌ర్మం పొడి బార‌కుండా కాపాడుతుంది. అలాగే బ‌య‌ట నుంచి వ‌చ్చే దుమ్ము, ధూళి నుంచి చ‌ర్మాన్ని కాపాడుతుంది.

గ‌డ్డం చ‌ర్మ సంబంధిత వ్యాధుల‌ను చాలావ‌ర‌కు నివారిస్తుంద‌ట‌. సూర్యుడి నుంచి వ‌చ్చే యూవీ కిర‌ణాలు ముఖం మీద నేరుగా ప‌డ‌కుండా అడ్డుకుంటాయ‌ట‌. సూర్య‌ర‌శ్మిని నియంత్రిస్తూ చ‌ర్మ సంర‌క్ష‌ణ‌కు దోహ‌ద‌ప‌డుతుంద‌ట‌. త‌ద్వారా చ‌ర్మ క్యాన్స‌ర్‌, చ‌ర్మ సంబంధిత వ్యాధులు ద‌రి చేర‌కుండా కాపాడుతుంద‌ట‌. గ‌డ్డం ఒక‌స్థాయిలో ఉన్న‌వారికి కొన్ని రోగాలు కూడా దూరంగా ఉంటాయ‌ట‌. అంతేకాదు, గ‌డ్డం ఉన్న‌వాళ్ళు ఎక్కువ కాలం యంగ్‌గా కూడా ఉంటార‌ట‌. గ‌డ్డం పెంచుకోవ‌డం ద్వారా ఇన్ని ప్ర‌యోజ‌నాలున్నాయ‌ని ఓ ప‌రిశోధ‌న‌లో తేలిందట‌.