గూడూరు కమిషనర్ ఓబులేసు ఆవేదన..

139

గూడూరు మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్ బ‌దిలీ వివాదాస్ప‌దంగా మారింది. రాజ‌కీయ క‌క్ష‌తో త‌న‌ను బ‌దిలీ చేశారంటూ క‌మిష‌న‌ర్ ఓబులేసు మీడియా ముందుకొచ్చారు. ప‌ట్ట‌ణంలో ఇటీవ‌ల జ‌రిగిన డంపింగ్ యార్డు ప‌నులకు సంబందించిన బిల్లును విడుద‌ల చేయ‌డంతో అధికార పార్టీ కౌన్సిల‌ర్లు గ‌దిలో పెట్టి త‌న‌ను, త‌న సిబ్బందిని నిర్భందించార‌ని వాపోయారు. గ‌తంలో తెలుగు దేశం పార్టీ త‌ర‌పున మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స్‌గా పొణకా దేవ‌సేన‌మ్మ వ్య‌వ‌హరించారు. ఆ స‌మ‌యంలో 15 ల‌క్ష‌ల వ్య‌యంతో డంపింగ్ యార్డు వ‌ద్ద ప‌లు ప‌నుల‌ను చేప‌ట్టారు. అప్ప‌ట్లో ఇందుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. అయితే ఆమె ఇటీవ‌ల వైసీపీలో చేరారు. దీంతో నిన్న జ‌రిగిన అత్యవసర స‌మావేశంలో బిల్లును రిలీజ్ చేయ‌డాన్ని టీడీపీ కౌన్సిల‌ర్లు తీవ్ర‌స్ధాయిలో వ్య‌తిరేకించారు. దాదాపు 3 గంట‌ల పాటు అధికారుల‌ను నిర్భందించారు. క‌మిష‌న‌ర్ ఎదురు తిర‌గ‌డంతో కౌన్సిల‌ర్లు అక్క‌డి నుంచి వెళ్లిపోయారు. త‌మ ప‌లుకుబ‌డిని ఉప‌యోగించి జిల్లా ఉన్న‌తాధికారులు, మంత్రుల దృష్టికి ఈ విష‌యాన్ని తీసుకెళ్లారు. దీంతో అప్ప‌టిక‌ప్పుడు క‌మిష‌న‌ర్ ను ప్ర‌భుత్వం బ‌దిలీ చేసింది. గ‌తంలో ప‌నిచేసి ప్ర‌స్తుతం నాయుడుపేట‌లో క‌మిష‌న‌ర్ గా ఉన్న చంద్ర‌శేఖ‌ర్ రెడ్డిని నియ‌మించారు. నాలుగున్న‌రేళ్ల‌లో 7 మంది క‌మిష‌న‌ర్లు గూడూరులో మారారని ఇది మున్సిపాల్టీ దౌర్భాగ్యమని అన్నారు. తాను అవినీతికి పాల్ప‌డి ఉంటే, విధుల్లో నిర్ల‌క్ష్యంగా వ్యవహరించి ఉంటే, ఉన్న‌ట్లు నిరూపించినా రాజీనామా చేస్తానన్నారు. రాజ‌కీయ క‌క్షతో త‌న‌ను బ‌లిప‌శువును చేశార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.