మీ హీరోల సినిమాలు పైరసీ చేసేది నేనే..

114

నవీన్‌ చంద్ర కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హీరో హీరోయిన్’. గాయత్రి సురేశ్‌, పూజా జవేరీ కథానాయికలు. జీఎస్‌ కార్తిక్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌ ట్విటర్‌ వేదికగా ఈ చిత్ర టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ‘మీ హీరోల సినిమాలను పైరసీ చేసేది నేనే..’ అంటూ నవీన్‌ చంద్ర చెబుతున్న డైలాగ్‌తో టీజర్‌ మొదలైంది. ఈ నేపథ్యంలో నవీన్‌ చంద్ర ఎన్టీఆర్‌ నటించిన సినిమాను పైరసీ చేస్తాడు.
దాంతో థియేటర్‌ వద్ద అభిమానులు నవీన్‌ చొక్కా పట్టుకుని ఇలా ఎందుకు చేస్తావని నిలదీస్తారు. ‘వచ్చే వారం రామ్‌చరణ్‌ సినిమా విడుదలవుతుంది. ఇంకా ఎక్కువ పైరసీ చేస్తా’ అని చెప్పగానే సదరు అభిమాని తెగ సంబరపడిపోవడాన్ని ఫన్నీగా చూపించారు. ‘ప్రొడ్యూసర్‌ కూతురివైతే నాకేంటే.. నిన్నూ వదలను, పైరసీని వదలను..’ అని నవీన్‌ చంద్ర తన ప్రేయసితో చెబుతున్న డైలాగ్‌ హైలైట్‌గా నిలిచింది. మొత్తానికి పైరసీతో ముడిపడిన ఓ ప్రేమకథా చిత్రమిది. టీజర్‌ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. మార్చిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.