గంటసేపు మృత్యువేట

3183

కలిగిరి, అక్టోబర్-21: ముందు కళ్లల్లో కారం కొట్టారు, మెడ నరికారు, తలపై గొడ్డలి వేటు వేశారు. కలిగిరి మండలం పాపన ముసిలిపాలెం గ్రామ పొలాల్లో దాదాపు గంటసేపు మృత్యువేట కొనసాగింది. నెల్లూరు నుంచి వచ్చిన ముగ్గురు వ్యక్తుల్ని గ్రామం పొలిమేరలోని పొలాల్లోనే శవాలుగా మార్చేశారు ప్రత్యర్థులు. బేల్దారి మేస్త్రీ సానా మహేందర్ రెడ్డి (37), సెంట్రింగ్ పనిచేసే కొండ్రెడ్డి సుబ్బారెడ్డి (43), వీరితో వచ్చిన మరో వ్యక్తి సానా సుబ్బారెడ్డి (47) ప్రత్యర్థుల దాడిలో ప్రాణాలు వదిలారు. కలిగిరి మండలం పాపన ముసిలిపాలెంలో పొలాలు కొనుగోలు చేసిన వీరు వాటిని చూసేందుకు కారులో వెళ్లారు. అయితే స్థానికులు కొంతమందితో ఈ పొలాల విషయంలో గతంనుంచీ గొడవలున్నాయి. ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టుకునే వరకు వెళ్లాయి. ఈనేపథ్యంలో స్థానికులు వీరితో గొడవకు దిగారు. అప్పటికే కారం, కత్తులతో సిద్ధంగా ఉన్న ప్రత్యర్థి వర్గం మహేందర్ రెడ్డి, సుబ్బారెడ్డిపై దాడికి దిగింది. కళ్లలో కారం చల్లి, కత్తులతో దాడికి దిగారు. ముగ్గుర్నీ పొలాల్లోనే మట్టుబెట్టారు. ఉదయం సుమారు 10గంటలనుంచి 11గంటల మధ్యలో ఈ ఘటన జరిగింది. అనంతరం నిందితులు నేరుగా పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయారని సమాచారం.