అందరూ వదిలేశారు..

1363

తెలుగుదేశం పార్టీ ఆత్మకూరు నాయకుడు కన్నబాబును పాపం తోడు పెళ్లికొడుకుని చేసేశారు. తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో తనను కరివేపాకులా వాడుకున్నారన్న కన్నబాబు ఆవేదన రోదనగానే మిగిలిపోయింది. ఆత్మకూరు ఇంచార్జిగా ఉంటూ వైసీపీలో చేరిన మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని తిట్టే కార్యక్రమంలో కన్నబాబుని తెలుగుదేశం పార్టీ నాయకులు తోడు పెళ్లికొడుకుగా తెచ్చి పక్కన పెట్టుకున్నారు. పార్టీలో తనను అవమానపరచడంతో కన్నబాబు ఆనంను విమర్శించే సమావేశాల్లో మౌనముద్ర వహించారు. తనను రామనారాయణ రెడ్డి స్థానంలో ఇంచార్జిని చేయకపోవడంతో పార్టీ కార్యాలయంలోనే ఆమరణ దీక్ష, నిరసన అంటూ కార్యక్రమాలు చేసినా పార్టీ పట్టించుకోలేదు. ఇప్పుడు దాదాపు కన్నబాబు ఉనికినే పార్టీ మర్చిపోయింది. దీంతో కన్నబాబు ఆత్మకూరు రాజకీయాల్లో తెరమరుగవుతున్నారు. ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇంచార్జిగా ఉన్నా అక్కడ కార్యక్రమాలు నెల్లూరు నుంచే రిమోట్ ద్వారా జరుగుతున్నాయి. వీటిలో కూడా కన్నబాబు ప్రమేయం ఉండటం లేదు. గతంలో కన్నబాబును చేరదీసిన మంత్రి సోమిరెడ్డి కూడా ఇప్పుడు పార్టీలోనే ప్రత్యర్థుల ఆరోపణలకు భయపడి ఆత్మకూరు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. గతంలో చంద్రమోహన్ రెడ్డిని అడ్డం పెట్టుకుని కన్నబాబును విమర్శించేవారు. కన్నబాబు, చంద్రమోహన్ రెడ్డి సఖ్యతగా ఉంటారన్న కారణంతోనే మంత్రి నారాయణ కానీ, ఆదాల కానీ ఆయనను దగ్గరకు తీసేవారు కాదు. రామనారాయణ రెడ్డి కూడా అదే సాకు చెప్పి చంద్రమోహన్ రెడ్డిపై ధ్వజమెత్తేవారు. ఇప్పుడు చంద్రమోహన్ రెడ్డి కూడా కన్నబాబుపై సీతకన్నేయడంతో కన్నబాబు పాత్ర తోడిపెళ్లికొడుకు క్యారెక్టర్ అయింది.