కాల్చింది మహిళా నక్సలైట్లే …

945

కాల్చింది మహిళా నక్సలైట్లే …

విశాఖ మన్యంలో ప్రజాప్రతినిధుల హత్యకు పాల్పడిన మావోయిస్టులను పోలీసులు ఒక్కొక్కరిగా గుర్తిస్తున్నారు. ఎమ్మెల్యే , మాజీ ఎమ్మెల్యేను కాల్చిన ముగ్గురిలో ఇద్దరు మహిళా నక్సలైట్లు. ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన తర్వాత ప్రాథమికంగా కొందరిని గుర్తించారు. స్థానికుల నుంచి సేకరించిన సమాచారంతో ముగ్గురి పేర్లను పోలీసులు వెల్లడించారు. ఆదివారం నాటి దాడిలో అరుణ అలియాస్‌ వెంకటరవి చైతన్య, స్వరూప అలియాస్‌ కామేశ్వరి, జులుమూరి శ్రీనుబాబు అలియాస్‌ సునీల్‌ ఉన్నట్టు ప్రకటించారు. అరుణ ఎస్‌జెడ్‌సీఎం దళానికి చెందిన వ్యక్తి అని, ఆమె స్వస్థలం విశాఖ జిల్లా కరకపాలెం కాగా.. స్వరూప భీమవరం వాసిగా గుర్తించారు. అలాగే మూడో వ్యక్తి శ్రీనుబాబు దబ్బపాలెం మండలం అడ్డతీగల వాసిగా గుర్తించారు. ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యోదంతంతో ఉలిక్కిపడిన పోలీసులు విశాఖ మన్యాన్ని జల్లెడ పడుతున్నారు. మావోయిస్టుల కోసం ప్రత్యేక బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయని విశాఖ ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. ఈ మేరకు ముఖ్యమైన ముగ్గురు మావోయిస్టుల ముఖ చిత్రాలను పోలీసులు విడుదల చేశారు. ఇంకా ఎవరెవరు పాల్గొన్నారనే దానిపై ఆరా తీస్తున్నారు.